పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/72

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదవ ప్రకరణము

ఒకనాటి రాత్రిదీపములు పెట్టిన నాలుగు గడియలకు మదనసింగును బ్రతాపసింగును గూర్చుండి రాజకీయ వ్యవహారములు ముచ్చటించుకొనుచుండిరి. ఆసమయమున వ్రేలాడుచున్న జడలతోడను శరీరము నిండ నలఁదుకొన్న భస్మముతోడను తెల్లమచ్చలుగల కృష్ణాజినముతోడను మెల్ల మెల్లగాఁ జిదానందయోగి వచ్చి వారి కట్టెదుట నిలిచెను. అతడు తఱచుగా రాత్రులయందు బ్రతాపసింగు గృహమునకు వచ్చుట కలదు. కాబట్టి యాతడరుదెంచిన కార్యమును నెఱిగి ప్రతాపసింగు వెంటనే లోనికి జనెను. మదనసింగు లేచి నమోనారాయణ! బావాజీ! యని సమస్కరించి యాతనిం దోడ్కొని గదిలోనికిబోయి వచ్చిన కార్యమేమని యడుగ యోగి యిట్లనియె ‘రాజా! నీవు రాజభక్తిగల రసపుత్రులలో నగ్రగణ్యుడవు. రాజు నిమిత్తము ప్రాణములనైన ధారపోయ గల సాహసికుడవు. గనుక నేను నీ నిమిత్తము వచ్చితిని. ఈ రాత్రి చిత్తూరునగరమునందు నేను ముందుగా మీతో చెప్పదగని ఘోరకృత్యములు జరుగదలచి యున్నవి. మన మీరాత్రి యేమాత్ర మశ్రద్ధ చేసినను మన మాజన్మాంతము విచారింపవలసి వచ్చును. తెల్లవారిన దాక నీవు నాతో నుండుము’ అని యోగి పలుక మదనసింగు శరీరము వడక నారంభించెను. యోగి యాతనిపై జేయివైచి నాయనా! భయపడకు నేనుండగ నీనగరమున కాపద కలుగదు. నీవు వచ్చునపుడు యుద్ధములయందు నీహస్తమలంకరించు ఖడ్గమును దీసికొని రమ్ము. నిన్ను నీ రాజపుత్రవేషమును మార్చి బ్రాహ్మణ వేషమును ధరించి జామున్నర రాత్రియైన