పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/7

ఈ పుట ఆమోదించబడ్డది

6

హేమలత

ఆయనను జూచువా రందఱు నతఁడు సుదరపురుషుఁడని యనకమానరు. లావుగానున్న శరీరమునం దాపాదమస్తకము వఱకును భస్మమలఁదఁబడి యుండుట చేతను మెడలో యజ్ఞోపవీతము వస్త్రముచాటుననుండి కనఁబడ కుండుటచేతను, నతఁడేజాతిమనుష్యుఁడో తెలిసికొనుట దుర్లభముగాని, యాతఁడు త్తరహిందూస్థాన వాస్తవ్యుఁడనియు నందు బ్రహ్మక్షత్రియ వైశ్య జాతులలో నొకజాతివాఁడనియు మాత్రమూహింపవచ్చును. తీవ్రమైన సూర్యతాపమువలన, బయలు వెడలిన చెమ్మటచేత శరీరమునం దలఁదుకొన్న భస్మ మక్కడక్కడ కరిఁగిపోయి యతని సహజకోమలమైన శరీరమును జూపుచుండెను. గడ్డమును జడలను నతఁడు యోగియని చెప్పుచున్నవి. కాని చక్కగా నవి పెరుఁగకుండుటచేత నూతనముగా నాశ్రమస్వీకారము నొనర్పునట్లు చూపరులు గ్రహింతురు. భగ్గుభగ్గుమని కాలు గాలుచుండినను, నెండవేడిమిచే శిరస్సు మాడుచుండినను, నతఁడు పాదరక్షలుకాని గొడుగు కాని ధరింపకయే దినమంతయుఁ బ్రయాణము జేసెను. బైరాగుల దగ్గఱ నుండు కక్షపాల, యతనిదగ్గఱనుండెనుగాని యోగిజనుల కత్యంత ప్రియము లగు గంజాయియుఁ జిలుమును నందులేవు. యమునా నదీతీరముననున్న మధురాపుర సమీపమున కతఁడు నాలుగుగడియల ప్రొద్దువేళ వచ్చినను నేమి కారణముననో పట్టణమునఁ బ్రవేశింపక క్రోసుదూరమున నున్న మామిడి తోఁటలో దాఁగియుండి సూర్యాస్తమయమయినతోడనే యాస్థలమును విడిచి చీఁకటికాల మగుటచేత నొరులకంటఁబడకుండ యమునాతీరమునకుఁబోవుచుం డెను. నదీతీరమునఁ జేరినతోడనే చంకనున్న కక్షపాల నొకమూలఁ బడ వైచి కాలుసేతులు జన్నీటఁ గడిగి మొగపైము నానిర్మలో దకములఁ జల్లుకొని నాలుగు పుడిసిళ్ళ నీళ్ళుత్రాగి యచ్చట నిసుక తిన్నపై నించుక