పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/65

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ ప్రకరణము

ఉత్తర హిందూస్థానమునందలి క్షత్రియకుటుంబములలో రాజస్థానములోని మీవారు రాజ్యమునేలు కుటుంబమే మొక్కవోని పరాక్రమముతోడను సత్కీర్తి తోడను నగ్రగణ్యమై యొప్పును. మహమ్మదుగోరీ హిందూదేశముపై దండెత్తివచ్చి యాకాలమున నుత్తర హిందూస్థానమునందుండెడి రాజులనెల్ల స్వదేశముల నుండి పాఱదోలెను. అప్పుడు రాజ్యభ్రష్టులైన రాజకులశిఖామణులందఱును దద్దేశమున స్వతంత్ర రాజ్యముల నేర్పఱచుకొని వసించుటజేసి యాదేశమున రాజస్థానమను పేరు కలిగెను. ఆ రాజస్థానమునం దనేక రాజపుత్రకుటుంబములున్నను వారిలో జిత్తూరు కుటుంబము నేటికిని గౌరవము నందుదొల్లిటి స్థితికి దీసిపోకయున్నది. మీవారు రాజ్యమునకు జిత్తూరు రాజధాని అయివుండెను. ఆకాలమునందు రాజస్థానమున జిత్తూరునకు సమానమైన పట్టణ మేవిషయమునను లేదు. చిత్తూరు రాజవంశము శ్రీరాముని ద్వితీయపుత్రుఁడగు కుశమహారాజుసంతతి యని చెప్పుదురు. అందుచేత సూర్య వంశజులనియు రాజకులప్రదీపకు లనియు వారిని రాజులందరు గణింతురు. పరాక్రమమునందును సత్కులప్రసూనత యందును సద్గుణవైభవమునందును రాజస్థానము నందలి తక్కినరాజులు చిత్తూరు రాజులకు దీసిపోవుట జేసి వారందరు జాలకాలమునుండి చిత్తూరు కుటుంబ గౌరవము నెరింగి యారాజులను దమకు సార్వభౌములుగ నేర్పరచుకొని వారియాజ్ఞలకు బద్ధులైయుండెడివారు. శత్రురాజులు రాజస్థానముపై దండెత్తినపుడు చిత్తూరు రాజునకు దక్కిన వారందరు నొకకట్టుగవచ్చి సాహాయ్యము జేయుచుండుటయు గలదు. మనము వర్ణించుకాలమున చిత్తూరునకు మహారాజు