పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/61

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

హేమలత

అట్లు పరాభవము నొంది నాజరుజంగు తనగృహమున కరిగి జరిగినవృత్తాంతమును జనకున కెఱిఁగింప నత డావార్తవిని యద్భుతపడి రాజభక్తికి బుట్టినిల్లని ప్రజలచే స్తోత్రమునందిన తనకుటుంబమున కది గౌరవహీనతయని చింతాక్రాంతుడయ్యెను. ఇచటఁ జక్రవర్తి దర్బారునం దున్నవారిని జూచి “యీకొలువు లోని సరదారు లెవ్వరును లోలోపల గుట్రలు సలుపక నాకుఁ బ్రతిపక్షులుగా నుండువారు నిరాటంకముగ నా కొలువు విడిచిపోవచ్చు” నని సెలవిచ్చెను. ఆమాట నాలకించి సభాసదు లెవ్వరును లేవరైరి గాని యొక పురుషుఁడు మాత్రము లేచెను. మాయలమారియగు వసంతభట్టను మహారాష్ట్రుడు తన యాసనము నుండి లేచి నిర్భయంబుగ గళమెత్తి యేలికతో నిట్లనియెను. “ఓ మహాప్రభూ! ఈవఱకుఁ జాలకాలమునుండి తమ వద్ద సేవజేసినవాడను. నేనింకఁ దమవద్ద నుండజాలను. ప్రభువు వారి క్రూరస్వభావమును జూడ నాకిం దుండుట కష్టముగ నున్నది. నాకు సెలవు నొసంగుడు” అని మహారాష్ట్రుఁడాడిన తోడనే పండ్లు పటపటఁ గొఱకుచు దురాత్మ! మాకొలువు నీకు భారముగ నుండినఁ బోఁదగును. కాని యిట్టి కారుకూతలఁ గూయనేల? మాప్రతిపక్షులు నిర్భయముగ గొలువువిడిచి పోవచ్చునని మేమభయ హస్త మిచ్చియుండుటచే నిట్టికాఱు లఱచియును బ్రాణముతోఁ బోఁ గలిగితివి పొమ్ము” అని చక్రవర్తి “ఈతఁడు మాకిదివఱకు జేసినసేవఁబట్టి వధింపక విడిచినారము. వెంటనే యీతని దీసికొనిపోయి కారాగృహమున బంధింపుడు” అని భటుల కాజ్ఞాపింప వారట్లుజేసిరి. ఇట్లు రాజస్థాన దండయాత్రను బ్రకటించి చక్రవర్తి దర్బారు చాలించెను. అందఱును దమతమ నిలయముల కరిగిరి. నాజరుజంగు తండ్రి మహావిచారమున మునిఁగి తన కుమారుని వెంటబెట్టుకొని యారాత్రి