పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/31

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

హేమలత

నిశ్చయముగ బ్రయాణమై చిత్తూరుపోయెదను. అని చెప్పి యారాత్రి సుఖముగా నిద్రించెను. మరునాడు రహిమానుఖాను వొద్ద సెలవుదీసికొని నాజరుజంగు నాగ్రా నగరమునకు బ్రయాణమయ్యెను.

మరునాఁడు వేకువజామున రాజపుత్రమహమ్మదీయు లొండొరుల వలన సెలవుగైకొని పోవుచున్నపుడు మదనసింగు నాజరుజంగును రహస్యస్థలమునకుఁ గొనిపోయి గాఢాలింగన మొనర్చి “మిత్రుడా! మన మిరువుర మన్నదమ్ముల వలె నుంటిమి. మన మన్యజాతులవారమైనను మనకు భేదము లేదు. ఇంక ముందుండదు. నాకిదివఱకుఁ జేసినది గాక యింకొక మహోపకారమును జేయవలయును. ఈ వృద్ధుఁడును బాలికయు నిరాధారులై యున్నారు. వారికి రహిమానుఖాను వలన భయము గలదు. అతనివలన నపాయము గలుగకుండ నీవు జాగ్రత పెట్టవలెను. ఈ యూర నెవరి కైనను వారి నప్పగింపుము. అన నాజరుజంగును నటులే చేయుదునని యాపూటకఁ బ్రయాణము మానెను. మదనసింగంతట నాజరుని జూచి “మనమింక మరల నెన్నఁడు కలియుదుమో? మామహారాజును మీచక్రవర్తియు సంధిచేసికొందురేని మనము రాకపోకలు గలిగి మన స్నేహబీజము యొక్క ఫలముల నందవచ్చును. కాదేని ప్రళయ యుద్ధమున మనము కలిసికొందుము. సాధ్యమయినప్పుడు నీక్షేమము నాకంపుచుండుము. నేఁ బోయి వచ్చెదను సలాము” అని తన పరివారముతోడ బయలుదేఱి మాటి మాటికి హేమలతను దలంచుకొని తిరిగిచూచి విచారించుచు వెడలి పోయెను. ఆనాఁటి మధ్యాహ్నము నాజరుజంగు తన తండ్రికి జిరపరిచయుండగు నబ్దుల్ ఖరీముమౌలవియనునాతనిం బిలిచి నారాయణసింగు నొప్పగించి వారి