పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/123

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

హేమలత

దుదముట్టింపవచ్చుననియు రహిమానుఖానుతో జెప్పెను గాని మరల నారాత్రి కొందఱి యాలోచనము చొప్పున భీమసింగును వధించుట మానుకొనెను. ఇప్పటికైనను బద్మినిపై దనకాస నశింపనందున భీమసింగును జంపిన వ్యవహారము మొదలే మోసమగుననియు నతడు సేమముగ నుండిన రసపుత్రులు పద్మిని దనవద్ద కేనాటికైన నంపి యతని ప్రాణముల రక్షించు కొందురనియు నమ్మి భీమసింగునకు మరణదండన మాన్పెను. మదనసింగు చావా మఱునాడు నిశ్చితమయ్యెను. రహిమానుఖా నాకార్యనిర్వాహమునకు నియమింపబడినందున నతని యానందము వర్ణింప దుస్సాధ్యమైయుండెను. ఆ మధ్యాహ్నమె యినుపకఱ్ఱలను గొలిమిలోబెట్టి యెఱ్ఱగ గాల్పించుచుండెను. ఆ సాయంకాలమునందు రహిమానుఖాను వద్దకు నందుడు వచ్చి “స్వామీ! హేమలత చంద్రసేనుని గుడారములోనే యున్నది. ఆరాత్రి చంద్ర సేనుడామెను గొనిపోయెనని విన్నాను. మీద మీచిత్తము” అని విన్నవింప నాడబోయిన తీర్థ మెదురయినట్లు తనహృదయమును బీడించు కన్యతన శిబిరమున నుండుటకు సంతోషించి, రాత్రి రెండు గడియలైన తరువాత దనయశ్వము నెక్కి ఖాను చంద్రసేనుని గుడారమున కరిగి యాతని బిలిచి తనకు నెట్లయిన హేమలతను సమర్పింపుమని యాతని బతిమాలుకొనెను. ఆతని మౌఢ్యమునకును దుర్వర్తనమునకును జంద్రసేను డచ్చెరువడి యాతనతో “మేము రాజులము, మీరు తురకలు, మాకన్యనెట్లు మీకియ్యగలమని యడిగినావు? చాలుజాలు! నీ చర్యలు గట్టిపెట్టుము. లేకున్న జక్రవర్తితో నిది చెప్పెదను; అని మందలించెను. రహిమానుఖాను నింటి కరిగి భగ్న ప్రయత్ను డగుటకు జింతించుచుండెను. చంద్రసేనుడు వెంటనే చక్రవర్తి సన్నిధి కరుగుదెంచి వినయపూర్వకముగ జరిగిన వృత్తాంత మంతయు