పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/116

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

115

లేని యాపిల్లపై నెట్టి నిందవచ్చెను. ఆమెను నేనుజూచి మాటలాడవలెనని యున్నది. నీకేమయిన నభ్యంతరముకలదా? అని పలికెను. తనకెట్టి యభ్యంతరము లేదని మదనసింగుత్తరముజెప్ప యోగి తక్షణమే వారియింటికారాత్రి పయనమయ్యెను. మదనసింగు యోగితో గృహమును బ్రవేశించి బాలిక యున్న గది జేరి యామెను జూపెను. ఆమెతో గొన్ని రహస్యములు మాటలాడవలసియున్నదని యోగి చెప్పి మదనసింగు వెలుపలికరిగెను. తరువాత యోగి బాలికకడ కరిగి “అమ్మా! జ్వరము నింపాదిగా నున్నదా? యని యడిగెను. దాని కామె యుత్తరము నీయక యోగిపై నూరకచూచుచుండ నతడును నీవెందుండి యిక్కడకు వచ్చినావుకుమారీ” యనియడుగ నామె మాటలాడదయ్యె. యోగి యామెహస్తమునబట్టుకొని నీవు నాపుత్రికవు. సిగ్గుపడకుము” అని ప్రియములాడ నామె సిగ్గువదలి మాటలాడుటకు సమ్మతించెను. వారిట్లు మాటాడిరి.

చిదా – నీవు నేటిదాక నెందున్నావు? ఎవరి సంరక్షణమున నున్నావు.

బాలి – నే నాయలీఘరులో రాజులయింట నుంటిని.

చిదా – నిన్ను పాలినుండి యెవరు తీసికొనివచ్చినారు?

బాలి – ఆగడబిడనుండి నేనే వచ్చినాను నన్నెవరు దేలేదు.

ఈ పలుకులువిని చిదానందయోగి యనుమానపడి యామె మేలిముసుగుదీసి మొగమువైపు పాఱజూచి మరల ముసుగిడి యీవలకు వచ్చి మదనసింగుతో నీమెకు నీనడుమ గలిగినకష్టములచే మతిచాంచల్యము సంప్రాప్తమైనది. నాకడకంపుము, నేను మందులనిచ్చి రెండుదినములలో