పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/113

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

హేమలత

భీమ – మీ చిత్తమువచ్చినట్లు చేయవచ్చును. మానహానికంటె బ్రాణహాని మేలు. మేమెవరికైనను వెఱచువారముకాము.

చక్ర – అవును. నేను మీసంగతి నెఱుగక దుర్మార్గుల యోజనమువలన మీదేశముపై దండెత్తినాడను. క్షమింపవలెను.

భీమ – క్షమించుట యేల? పొరపాటునకు నెవ్వరేమి చేయగలరు?

ఇట్లు చక్రవర్తియు భీమసింగును మాటాడుచుండ నొంటిగ దొరికిన మహమ్మదీయుని వధింపవలెనను కోరిక యేరికిని జనింపదయ్యె. అంతట జక్రవర్తి శిబిరమునకు మరల బ్రయాణమగుటచే భీమసింగు చక్రవర్తిని సాగనంపుటకు దనకోట విడిచి కొంతదూర మొంటరిగాసాగిపోయెను. అప్రస్తుతములగు కొన్ని మాటల జెప్పుచు జక్రవర్తికి భీమసింగును దనసేనా నివేశముదాక గొనిపోయెను. అప్పుడాకస్మికముగ నదివఱకు జక్రవర్తిచే నియమితులై పొంచుండియుండిన కఱకుతురకసైనికులు భీమసింగురాజుపై నొక్కపెట్టునబడిరి. మనోధైర్యమున హిమాద్రిమగు భీమసింగు ఘోరమైన యీమోసము నకు నాశ్చర్యపడి తనకత్తితో ననేకభటుల నాపెను కాని సైన్యము లపారముగనుండబట్టియు రసపుత్రులు దూరముగానుండబట్టియు భీమసింగు విజయమొందజాలక యలసియుండ రహిమానుఖాను వచ్చి యాతని పైజేయివైచి నిన్ను ఖైదిగ బట్టుకొన్నాము రారమ్ము అని లాగెను. అప్పుడు మహమ్మదీయ ప్రభువులు వచ్చి రాజపుత్ర సింహమును జెఱబట్టిరి. పద్మినిని సమర్పించినగాని బంధవిమోచనము జేయుట లేదని చక్రవర్తి స్పష్టముగ నుడివెను. భీమసింగు మ్లేచ్ఛులచే జిక్కిన వార్త చిత్తూరు కోటలో దెలిసినపుడు