పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/100

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

99

బెట్టికొని లోపలికి వచ్చెను. అతఁడు హేమలతను జంద్రావతిని దనవద్దనుంచుకొని వాని వృత్తాంతమును జెప్పమనఁగా “అయ్యా! తమయింట హేమలత యున్నదని తెలిసి శ్రీమదనసింగామెను వెంటబెట్టి కొని రమ్మని నన్నుఁబంపినాఁడు. వివాహప్రయత్నము సర్వముజరిగి సిద్ధముగ నున్నది. చిత్తూరిరాజు భీమసింగుగా రీమెనుదోడి తెమ్మని పల్లకియు పండ్రెండుగురు బోయలను నిరువురబంట్రోతులను నా వెంట నంపినారు. చక్రవర్తికిని రాజపుత్రులకును మహాయుద్ధము సంప్రాప్తమగును గనుక సాధ్యమైనంత శీఘ్రముగ రప్పింపుమని వారు సెలవిచ్చినారు. మీద మీ చిత్తము” అనిచెప్పి సేవకుఁడూరకుండెను. ఈ మాటలు హేమలత హృదయారవిందమును వికసింపఁజేసెను. చంద్రావతి హేమలతావియోగము గలుగునని విచారభరముదాల్చెను. నీయిష్టమేమని శివప్రసాదు హేమలతనడిగెనుగాని యామెయుత్తరమీయదయ్యెను. శివప్రసా దనంతరమునఁ దనభార్యకావృత్తాంతమును జెప్ప నామె యభిప్రాయము నీయఁజాలక తడఁబడజొచ్చెను. రాత్రి జామగునిప్పటికి బోయలు పల్లకి నెత్తి కొనివచ్చి గుమ్మముముందుట నిల్చిరి. శివప్రసాదు వారికందఱకు నన్నముబెట్టించి పండుకొను సదుపాయముచేసెను. చంద్రావతి, హేమలత మనస్సులో జిత్తూరుపోవుటకిష్టమున్నట్లు మాటలవల్ల సూచకముగా నెఱింగి తలిదండ్రుల కెఱింగింప వారును హేమలతవివాహము నాపుట మేలుకాదనియు మొదట నామెనప్పగించిన యోగి కూడ మదనసింగువద్దకంపుట నిష్టపడెననియు నాలోచించి యామెను చిత్తూరునంపుటకు నిశ్చయించకొనిరి. మఱునాఁడు మధ్యాహ్నము ప్రయాణము నిర్ణయింపబడెను. శివప్రసాదును, భార్యయు, నామెను దమపుత్రికవలెఁ జూచుకొనుచున్నందునఁ జీరలురవికెలు మొదలగువాని నిచ్చిరి.