ఈ పుట ఆమోదించబడ్డది

9. సత్వర హృద్ధమని వ్యాధులు

(Acute Coronary Syndrome)

హృదయమునకు మిగిలిన అవయవముల వలె ప్రాణవాయువు, పోషక పదార్థములు అందించుటకు రక్తప్రసరణ అవసరము. హృదయము నిరంతరముగా జీవితకాలము అంతా తోడు యంత్రముగా (pump) పనిచేయాలి. అందువలన దానికి నిరంతరము రక్తప్రసరణ చేకూరాలి. హృదయ ధమనులు (హృద్ధమనులు; Coronary arteries) హృదయమునకు రక్తము కొనిపోతాయి. హృత్సిరలు రక్తమును తిరిగి హృదయములో కుడికర్ణికకు (right atrium) చేరుస్తాయి.

హృదయమునకు రక్తప్రసరణ తగినంత లోపిస్తే గుండెనొప్పి (angina pectoris), ఆ లోపము చాలా తీవ్రము అయినపుడు గుండెపోటు (Heart attack) కలుగుతాయి. గుండెపోటు కలిగినపుడు కొంత హృదయ కండర కణజాలము ప్రసరణరహిత మరణము (infarction) పొందుతుంది. అందువలన ప్రాణనష్టముతో బాటు ఇతర ఉపద్రవములు కలిగే అవకాశము ఉన్నది. ప్రపంచములో 30 శాతపు మరణములు హృదయ రక్తప్రసరణ లోపముల వలన కలుగుతాయి.  

హృద్ధమనులు:

హృదయమునకు రక్తప్రసరణ వామ (ఎడమ) హృద్ధమని (Left coronary artery) దక్షిణ (కుడి) హృద్ధమని (Right coronary artery) సమకూరుస్తాయి.

వామ హృద్ధమని (Left Coronary artery):

ఎడమ లేక వామ హృద్ధమని బృహద్ధమని (aorta) నుంచి ఎడమ బృహద్ధమని కవాటము పైన మొదలవుతుంది. ఇది  వామ పరిభ్రమణ ధమని (left circumflex artery), వామ పూర్వ అవరోహణ ధమని (left anterior descending artery) అను రెండు శాఖలుగా చీలుతుంది.

95 ::