ఈ పుట ఆమోదించబడ్డది

4. క్రొవ్వులు - కొలెష్ట్రాలు

ధమనీకాఠిన్యము (Atherosclerosis) :

పాతదినాలలో తరచు వినేవారము కాదు గాని యీ తరములో చాలామంది అధిక కొలెష్ట్రాలు (Cholesterol) గురించి వినే ఉంటారు. గుండె పోటులు (Heart attacks), మస్తిష్క రక్తనాళ విఘాతములు (Cerebrovascular accidents) దూర రక్తప్రసరణ లోపాలకు (Peripheral vascular diseases), ధమనీకాఠిన్యము (Atherosclerosis) కారణమని వైద్యశాస్త్రజ్ఞులు గ్రహించిన తరువాత, ధమనులు బిరుసు ఎక్కడానికి క్రింది హేతువులను పరిశీలనల వలన, గణాంకముల వలన వైద్యులు గ్రహించారు.

1) రక్తపుపోటు (Hypertension)

2) మధుమేహవ్యాధి (Diabetes mellitus)

3) పొగత్రాగడము

4) అధిక కొలెష్ట్రాలు (Hypercholesterolemia)

5) ఊబకాయము (Obesity)

6) వ్యాయామలోపము

7) వంశానుగతము

8) వృద్ధాప్యముల

వలన ధమనులు బిరుసెక్కడము, సన్నబడడము, ఇరుకుబడుట జరిగి దుష్ఫలితములు కలుగవచ్చును. వయస్సుతో బాటు పైన పేర్కొన్న కారణాల వలన ధమనుల లోపొర (Intima) క్రింద కొలెష్ట్రాలు, కొవ్వులు  క్రమేణ పేరుకొంటాయి. రక్తములో ఉన్న కొవ్వులను భక్షక కణములు (macrophages) మింగి ధమనుల లోపొర క్రింద చేరుకుంటాయి. కొవ్వులు, కొలెష్ట్రాలను మింగిన భక్షణ కణాలు ఫేనకణములుగా (Foam cells) మారుతాయి. ఈ కణాలు విచ్ఛిన్నమయినపుడు ఆ కొవ్వులు బయటకు

50 ::