ఈ పుట అచ్చుదిద్దబడ్డది

25. మానసిక స్థితి వై పరీత్యాలు ( Mood disorders ) మనమంతా ఎవరికి వారు తాము ప్రత్యేక వ్యక్తులమని భావిస్తుంటాము. ప్రతి జీవి ఒక తల్లి, ఒక తండ్రి నుంచి ఉద్భవించి, తనచుట్టూ ఉన్న పరిసరములను అర్థము చేసుకొని, వాటికి అనుగుణముగా వర్తించి మనుగడ సాగించడానికి యత్నిస్తుంది. మరి జంతువులలోను, మనుజులలోను అవయవపుంజము, జీవితము మస్తిష్కముతో ముడిపడి ఉంటాయి. మస్తిష్కము విభిన్న ఆలోచనలకు, భావోద్రేకములకు స్థానమయి ఉంటుంది. ఈ మస్తిష్క కణజాలములో ఉత్పత్తి, రవాణా, ధ్వంసమయే రసాయన పదార్థములపై మనోప్రవృత్తులు, మానసికస్థితులు ఆధారపడి ఉంటాయి. మన అందఱి మానసిక స్థితులు కాల,పరిసర పరిస్థితులకు అనుగుణ్యముగా మార్పులు చెందినా కొందఱిలో ఆ స్థితులు విపరీతము అగుటయో, చాలాకాలము స్థిరముగా ఉండుటయో జరిగినపుడు మనోస్థితి వైపరీత్యములు, మానసిక రుగ్మతలు కలుగుతాయి. మానసికరుగ్మతలకు జీవిత కాలములో సుమారు 25 శాతము మంది కొద్దిగానో, హెచ్చుగానో గుఱి అవుతారు. అట్టివారిలో కొంతమంది దిగులుతో ఆత్మహత్యలకు పాల్పడుతారు. కొందఱు భావోద్రేకములతో  హింసా ప్రవృత్తులను అలవరచుకుంటారు. మానసికశాస్త్రము ఒక శాస్త్రముగాను, నవీన వైద్యములో ఒక భాగముగాను పరిణామము చెందినది. దిగులు (Depression)

280 ::