ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తాపముల (Pneumonitis) సంశయము ఉంటే ఛాతికి ఎక్స్ రే (chest x-ray) అవసరము. ఆ సంశయము లేకపోతే ఎక్స్ రేల అవసరము లేదు.

చికిత్సతో తగ్గనపుడు, ఆయాసము ఎక్కువగా ఉన్నపుడు, ఎక్స్ రే వ్యత్యాస పదార్థములతో ఛాతికి గణనయంత్ర చిత్రీకరణము (CAT Scan) చేస్తే పుపుసధమనులలో అవరోధకములు (Pulmonary embolism) కనుగొనుటకు లేక, లేవని నిర్ధారించుటకు ఉపయోగపడుతుంది.

ఆయాసము తీవ్రముగా ఉండి శ్వాసవైఫల్యమునకు (Respiratory failure) అవకాశము ఉంటే, ఉబ్బసకు తక్షణ చికిత్సతో బాటు కృత్రిమశ్వాసలు (artificial respirations ) అందించుటకు కూడా వైద్యులు సన్నద్ధులు కావాలి. గరిష్ఠ వాయు ప్రవాహము (Peak flow) 25 శాతమునకు తగ్గినపుడు, రక్తములో ప్రాణవాయువు బాగా తగ్గినపుడు, బొగ్గుపులుసువాయువు బాగా పెరిగినపుడు, ఊపిరి మందగించి నపుడు వైద్యులు కృత్రిమ శ్వాసలు అందించాలి. శ్వాసవ్యాపార పరీక్షలు (Pulmonary function tests):

ఉబ్బసవ్యాధిని ధ్రువపఱచుటకు శ్వాసవ్యాపార పరీక్షలు (Pulmonary function tests) సహాయపడుతాయి. ఆ పరీక్షలకు శ్వాసమాపకము (Spirometer) అనే పరికరము ఉపయోగిస్తారు. సుదీర్ఘ సంపూర్ణ ఉచ్ఛ్వాసమును (forced inspiration), తదుపరి సత్వర సుదీర్ఘ నిశ్వాసమును (forced expiration) ఈ పరికరముతో కొలుస్తారు. బలమైన దీర్ఘ ఉచ్ఛ్వాసము తర్వాత బలమైన దీర్ఘ నిశ్వాసముతో వదిలే గాలి ఘనపరిమాణమును సంపూర్ణ శ్వాస ప్రమాణముగా (Total Vital Capacity TVC లేక Forced Vital Capacity FVC) పరిగణిస్తారు. బల నిశ్వాసముతో మొదటి సెకండులో వదిలే గాలి పరిమాణము (Forced Expiratory Volume  first second; FEV 1),  FEV 1/FVC నిష్పత్తులను ఉపయోగించి అవరోధక పుపుస వ్యాధులను (Obstructive lung diseases), నిర్బంధ పుపుస వ్యాధులను (Restrictive lung diseases) వేఱుపఱచవచ్చును. ఉబ్బస అవరోధక శ్వాసవ్యాధి. ఉబ్బస ఉన్నపుడు వారిలో మొదటి సెకండులో బలనిశ్వాస వాయుపరిమాణము  (FEV 1) విశేషముగా తగ్గుతుంది. శ్వాసనాళికల వ్యాకోచ చికిత్స అనంతరము (Post

164 ::