ఈ పుట ఆమోదించబడ్డది

పదునాల్గవ ప్రకరణము.


భారతభూమి స్వతంత్ర మెట్లగును.


చదువరి: నాగరికమునుగురించి మీరు చెప్పిన యభిప్రాయము లర్థమయినవి. నేను వానిని గురించి మననము చేసికొందును. అంతయు నొక్క పర్యాయముగా మ్రింగజాలను. ఇట్టి యభిప్రాయములుగల వారు భారతభూమిని స్వతంత్రము చేయుట కేమి మార్గము చెప్పుదురోయని యెదురు చూచుచున్నాను.


సంపా: నాయభిప్రాయము లొక్కపెట్టున అంగీకృతము లగునని నేను నమ్మువాడను కాను. మీబోటి చదువరులకు నివేదించుటమాత్రము నాధన్మము. కాలము తక్కుంగల పనిని నెరవేర్చును. భారత భూమిని స్వతంత్ర మొసర్చు స్థితిగతులిదివరకే వివరించినాము. ఆవివరణమంతయు నేరుగా చేసినది కాదు కావున ఇప్పుడట్లు చేసిచూపెదను. రోగకారణమును నశింపచేసిన రోగము నశించుననుట లోకములో అందరకును విశదమయిన సిద్ధాంతమే. అట్లే భారతభూమి దాస్యమునకు కారణమేదో ఆ కారణమును తొలగించిన యెడల దాస్యమును తొలగుననుట నిజము.