ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునేడవ ప్రకరణము.

సాత్త్విక నిరోధము.

చదువరి: మీరు ఆత్మబలము, ప్రేమబలము మంటిరే అది యెచ్చటనైనను విజయమందినట్లు చారిత్రక నిదర్శనము లున్నవా? ఏజాతియు ఆత్మబలముచే అభివృద్ధియైన ట్లెచ్చటను చెప్పబడలేదు. పశుబలశిక్ష లేక దుర్మార్గులు దుర్మార్గమును వదల రని నా కింకను నమ్మకమే,

సంపా: కవి తులసీదా సిట్లనుచున్నాడు. “దేహమునకు అహంకారము బీజ మయినట్లు మతమునకు దయాప్రేమలు బీజములు. కాబట్టి మన మెప్పుడును దయను వీడరాదు.” ఇది సశాస్త్రీయము. రెండునురెండు నాలుగను టెంతసంపూర్ణ సత్యమో ఇదియు నంత సంపూర్ణ సత్య మని నానమ్మిక. ప్రేమ యొక్క శక్తి ఆత్మశక్తి, సత్యశక్తితో నైక్యము. నిమేషనిమేషము దానిప్రభావము మనకు దృష్టము. ఆశక్తియే లేనిచో ఈప్రపంచమే యుండదు. మీరు చారిత్రక నిదర్శనము కావలయు ననుచున్నారు. కాబట్టి చరిత్రయనగా నేమో యెరుంగుట యవసరము. గుజరాతీభాషలో చరిత్రకుగల పర్యాయపదము " ఇతిహాస్ ” “ ఇది ఇట్లునడచినది”. చరిత్రకు అర్థము ఇదే యగునేని జరిగినసంగతు లెన్ని యో చెప్పవచ్చును.