ఈ పుట అచ్చుదిద్దబడ్డది



రత్నాంగి : లేకుంటే ప్రమాదం వుంది - డబ్బు పాపిష్టిది - యెవరి కే దుర్వూహలు వున్నాయో?

మంజు : వొక్కర్తవీవుండడానికి భయం వేఁయదా?

రత్నాంగి:బతికివున్నప్పుడు భయపడందానికి చచ్చిం తరువాత భయపడుతానా?

(మంజువాణి పైకి వెళ్లును. రత్నాంగి తలుపు వేసి లాంతరు వెలిగించి తిరిగి చూసును. మూలనున్న పెద్ద జాడీలోంచి కొండుభొట్లు లేచును - రత్నాంగి గుండె ఝల్లుమని కొవ్వొత్తి జారవిడుచును - కొండుభొట్లు వూరుకొమ్మని చేత్తో సంజ్ఞ చేసును -రత్నాంగి కొవ్వొత్తి తిరిగీ తీసుకొని కొండుభొట్లు దగ్గరకు వెళ్లును)

కొండు : మంచి యెత్తు యెత్తావు. నీ అంత బుద్ధి మంతురాలు లోకంలో లేదు.

రత్నాంగి:మీ కంటేనా?

కొండు : అంచేతనే మనవుభయులం యిక్కడ కలిశాం.

రత్నాంగి:యిన్నాళ్లు యిటు కనపడితే అటు మొహం తిప్పేవారే?

కొండు : ఆ రాక్షసి ముండ రామసానికి నీ పేరు చెబితే యిష్టం లేకపోయేది. మరిదాన్ని ఆశ్రయించుకు బతక్క తీరేది కాదు; అంచేత నీకు యెడ యెడంగా తిరిగే వాణ్ణి గానీ నీచతురతా - నీ విద్యా - నీ ధర్మబుద్ది - చదువుకున్న వాణ్ణి నేను కాన లేదనుకున్నావా? ..... తెల్లవారేసరికి యీ సరుకులన్నీ కరగడానికి తగిన సాధన సామగ్రి సిద్దంగా వుంది. వొంతులు యేర్పర్చేయి - నన్ను మాత్రం కలుపుకున్నావంటే పోలీసు గీలీసు నిన్ను ముట్టలేరు - మంజువాణి డబ్బు విలువ యెరగదు. మనం యెంత వుడాయించినా పోల్చలేదు.

(కొండుభొట్లు రత్నాంగి భుజం మీద చేయి వేసి)

కొంచెం ఆసరాయియ్యి పైకి రావడం దండ ఘడియ పడుతుంది. కాళ్లకి కొంచెం మేహవాతనొప్పులు.

(రత్నాంగి కొండుభొట్లుచేయి విదల్చి సరుకులు జాడీలో పడివేయ నారంభించును.)

కొండు : సరుకులు జాడీలో పడివేస్తున్నావేమి?

రత్నాంగి:జాడీతో కూడా పట్టుకుపోవడానికి.

కొండు : జాడీ యెలా మోసుకువెళ్లడం.

రత్నాంగి : జాడీ మొయ్యడానికి మనుషులున్నారు.

గురుజాడలు

490

కొండుభొట్టీయము