ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మంజు : యేది యిందాకటి పద్యం చదవండీ.

కొండి : (రాగవరసను చదువును)

“చ నను భవదీయ.........

(అలా రాగవరసని చదువుతూవుండగా వెనుక వైపు వచ్చి మంజువాణి శాస్తులు వీపు మీద తన్నును)

ఓస్నీ అమ్మాశిఖా... (అని తగ్గి).... ఆహా! మల్లి పువ్వుల గుత్తా? పట్టుకుచ్చా? మలయ మారుతమా? వీపు తాకినది?

మంజు : సానిదాని కాలు.

కొండి : కాదు! కాదు! మన్మధుని వాడి వాలు.

మంజు : ప్రాస కుదిరింది కాని, శాస్తుల్లు గారు! యీ తాపు మదనశాస్త్రంలో క్రియక్రింద పరిగణన మవుతుందా? భూసురోత్తములను తన్నిన పాపం క్రింద పరిగణన మవుతుందా.?

కొండి : పది రూపాయీలు పారేస్తే పుణ్యం కింద పరిణామం అవుతుంది.

మంజు : పాటు పడక పైసా రాదు.

కొండి : బ్రాహ్మడికల్లా సాపాటు వక్కటె పెద్దపాటు యేర్పాటు చేసి బ్రహ్మ పడేశాడు.

మంజు : అయితే పెందరాళే వెళ్ళి ఆపాటు పడండి.

కొండి : మంజువాణి! యెంత చదువుకున్నా మా వంటి వాళ్లం నీకు వక్క మాటకు సదుత్తరం చెప్పగలమా? బాపనాళ్ళని కనికరించి, ఒక డబ్బు సొమ్ము ఇవ్వాలి గాని.

మంజు : వేశ్యల ద్రవ్యం పాపిష్టిది. బేరం తెచ్చి రుసుం పుచ్చుకుంటే ప్రత్యువాయువుండదు.

కొండి : ఈ వూళ్ళో నానాటికి రసికత సన్నగిల్లుతూన్నది. “అంధునకు గొరయవెన్నెల” అన్నట్టు ఈ వూళ్ళో మూర్ఖులకు నీరూపలావణ్య విలాస విశేషములు అగ్రాహ్యములు. తోవంటపోయే పొన్నూరు వాళ్లను కాచి పట్టుకొవ్వాలి.

మంజు : ఈ కంసాలాడు యింటి యెదుట దుకాణం బెట్టుకొని యిక్కడికి వచ్చే వాళ్లనల్లా వాళకం కట్టుతూ వుంటాడు. వాడిని తెస్తే.......

(తెర దీంచవలెను.)

గురుజాడలు

465

కొండుభొట్టీయము