ఈ పుటను అచ్చుదిద్దలేదు

సౌజ : ఔను గాని, గొప్పదేశంలో వున్న చెడ్డనే మనం అవలంబించాలా? గిరీశం గారు అట్టి అపవిత్రమైన పనికి ఇయ్యకొనరు. కొత్త మనిషి : అయితే పెళ్లి చేసుకోగోరిన వేశ్యలకు కోరతగిన వరులు దొరకడం యెలాగండి? లేక యెట్టి వారైనా సరే అని తమ అభిప్రాయమా అండి? సౌజ : ఈ సంగతి యింకా నేను బాగా ఆలోచించ లేదు - వేశ్యలు విద్యలు నేర్చి, ఇతర వృత్తుల వల్ల సత్కాలక్షేపము చెయ్యరాదా? కొత్త మనిషి : అట్లా చేస్తే, తమవంటి వారు వాళ్లను వివాహమౌదురా? సౌజ : యేం ప్రశ్న? నేను యెన్నడూ వేశ్యను పెళ్లాడను, నా యెత్తు ధనం పోస్తే వేశ్యను ముట్టను. కొత్త మనిషి : ప్రమాదం వల్ల వేశ్య శరీరం తమకు తగిలితే? సౌజ : (నవ్వుతూ) తగిలిన శరీరం కోసేసుకుంటాను. చిత్రమైన ప్రశ్నలడుగుతున్నారు ! కొత్త మనిషి : వేశ్యజాతి చెడ్డ కావచ్చును. గాని తాము శలవిచ్చినట్టు చడ్డలో మంచి వుండకూడదా? మంచి యెక్కడనున్నా గ్రాహ్యం కాదా అండి? సౌజ : మంచి యెక్కడనున్నా గ్రాహ్యమే. గాని మీరు వచ్చిన పని చెప్పారు కారు? కొత్త మనిషి : నా పని మట్టుకు మిమ్మల్ని చూడడమే. సౌజ : చూడడానికి నిశీధి వేళ రావలెనా? కొత్త మనిషి : మీ పని మించిపోకూడదని అట్టి వేళ వచ్చాను. సౌజ : మించిపోయే పనులేవీ నా పనులు లేవే? కొత్త మనిషి : దురవస్థలో వున్న వారి పనులల్లా తమ స్వంత పనులు గానే యోచింతురని లోకుల వల్ల విన్నాను. మరేం లేదు, అవధాన్లు గారి కేసులో గట్టి సహాయం చెయ్యగలిగిన వారి నొకరిని నేను యెరుగుదునండి. సౌజ : అలాగైతే మిమ్మల్ని మా పాలిట దేవుణ్ణిగా భావిస్తాం. కొత్త మనిషి : అంత మాట నాకు దక్కాలి గదా అండి? సౌజ : యేమి అలాగ అంటున్నారు? కొత్త మనిషి : మరేమీ లేదు. ఆ కార్య సాధనము ఒక వేశ్యవల్ల కావలశివున్నది. అదీ చిక్కు. సౌజ : డబ్బు యిద్దాం. గురుజాడలు 413 కన్యాశుల్కము - మలికూర్పు