ఈ పుటను అచ్చుదిద్దలేదు

(గిరీశంతో) - యినసిపికటరు గారు నీకంటే యెక్కువ యింగిలీషు చదువుకున్నా ఆయనకి మన శాస్త్రాల్లో నమ్మకాలు పోలేదు. హెడ్డు : ఆయన దగ్గరికి వెళతారా యేవిఁటి? గవర : (వెళ్లుతూ) కబురంపించారు. హెడ్డు : రండి, రండి, గవరయ్య గారూ చిన్నమాట. గవర : (వెళ్లుతూ) ఆ చిన్న మాటేదో (గిరీశమును చూపి) ఆ మహానుభావుడుతో చెప్పండి. (నిష్క్రమించును.) హెడ్డు : (గిరీశంతో) ఈ సాక్ష్యం మీరు మాట దక్కించుకున్నారు మరి సాక్ష్యవఁన్నదీ లేదు. గిరీశం: ఆ మాటకొస్తే - నేనే సాక్ష్యానికి దిగి, కేసు నీళ్లు కారించేస్తాను. నా శక్తి చూతురు గానీ - సౌజన్యారావు పంతులుతో మాత్రం ఆ మాట యింకా చెప్పకండి. (తెరదించవలెను.) కవ స్థలము : సౌజన్యారావు పంతులు గారి యిల్లు (మేడపైని పంతులుగారి పడకగది. ఒక బల్లపైని సన్నని గాజు దీపము కొంచము వెలుతురు కలుగజేయును. గది మధ్యను మెట్లవైపునున్న గుమ్మమునకు యెదురుగా దోమతెర మంచము ఉండును. దానిపైని సౌజన్యారావు పంతులు మేలుకుని పరుండియుండును. మంచము రెండవ ప్రక్కను చిన్న రౌను బల్లపైని గిల్టు కవరూ అంచులూ గల భగవద్గీతా పుస్తకము. ప్రక్కని కుర్చీ మీద గిరీశము కూర్చునియుండును. ) గిరీశ : నా మనసు డైలెమ్మాలో పడి చాలా భేదిస్తూందండి. యే రీతినైనా నా అన్నగారు యీ ఆపద దాటుదురా అని ఆతృత వొకపక్కా, అసత్యమునా కార్యసాధనంగా చేసుకోవడం అనే జిఘాస ఒక పక్కా నన్ను పీడిస్తున్నవండి. “అబద్ధపు సాక్ష్యం వొద్దు, నిజమైన సాక్ష్యం జాగ్రత చెయ్యండి” అని హెడ్డు కనిష్టీబుతో నేను అనేసరికి నాపైని కొండంత కోబ్బడ్డాడండి. నిజమైన సాక్ష్యం ప్రయత్నిస్తే దొరకదా అండి? సౌజ : నిజమైన సాక్ష్యం! యేం సత్యకాలం! నిజవాఁడే వాడు సాక్ష్యానికి రాడు. సాక్ష్యానికొచ్చిన వాడు నిజవాఁళ్లేడు. కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 406