ఈ పుటను అచ్చుదిద్దలేదు

కేసు పోవడమన్న మాట యెన్నడూ లేదు. యీ డిఫెన్సు చిత్తగించండి. (చంకలోని రుమాల్ కట్టతీసి విప్పి అందులో ఒక కాగితము తీసి చదువును) “ఫిర్యాదీ చెప్పిన సంగతులు యావత్తూ అబద్ధం కాని యెంత మాత్రం నిజం కావు”. చూశారూ ఆ వక్క మాటతోటే ఫిర్యాదీ వాదం అంతా పడిపోతుంది. “ఫిర్యాదీ నా మీద గిట్టక దురుద్దేశంతో కూహకం చేసి కేసు తెచ్చినాడు కాని యిందులో యెంతమాత్రం నిజం లేదు”. రామ : డిఫెన్సు మాటకేమండి గాని అవధాన్లు గారు పైసా లేదంటున్నారు. నాయడు: పైసా లేకపోతే పనెలా జరుగుతుంది? రామ : ఒక సంగతి మనవి చేస్తాను యిలా రండి (రామప్పంతులు, నాయడు, వేరుగా మాటలాడుదురు). నాయడుగారూ మీ వకార్తీ యీయనకేమీ సమాధానం లేదు. నేయెంత చెప్పినా వినక భీమారావు పంతులు గారికి వకాల్త్ యిచ్చాడు. మీకు యింగ్లీష్ రాదనీ, లా రాదనీ, యెవడో దుర్బోధ చేశాడు. నాయడు: స్మాలెట్ దొరగార్ని మెప్పించిన ముండా కొడుకుని నాకు లా రాకపోతే యీ గుంట వెధవలకుటోయ్ లా వస్తుంది. పాస్ పీసని రెండు యింగ్లీషు ముక్కలు మాట్లాడడంతోటే సరా యేమిటి? అందులో మన డిప్ట్ కలక్టరు గారికి యింగ్లీషు వకీలంటే కోపం. అందులో బ్రాహ్మడంటే మరీని. ఆ మాట అందరికి బోధపర్చండి. రామ : మరి కార్యం లేదండి. నే యెంతో దూరం చెప్పాను; తిక్కముండాకొడుకు విన్నాడు కాడు. నాయడు: అయితే నన్నిలాగు అమర్యాద చేస్తారూ? యీ బ్రాహ్మడి యోగ్యత యిప్పుడే కలక్టరుగారి బసకు వెళ్లి మనవి చేస్తాను. (తెరదించవలెను) గురుజాడలు 369 కన్యాశుల్కము - మలికూర్పు