ఈ పుటను అచ్చుదిద్దలేదు

లుబై : అయ్యో! అయ్యో! రామప్పంతులు యిల్లు వొల్లకాడు కానూ! యక్కడ కల్పించాడే, యీ మాయ పెళ్లి నాకోసం! వీడి పిండం పిల్లులికి పెట్టా! అయ్యో! అయ్యో! ఆ మొగుడు వెధవ యలా వున్నాడందే. మీనా : వాడు రోజూ దానికి కనపడతా! నాన్నా, వాడికి మీసాలూ, గిరజాలూ వున్నాయట, చావం చాయట. లుబ్ధి : వాడేనే! వాడేనే! యేవిఁటే సాధనం? యిహ నేం దక్కను. మీనా : పూజారి గవరయ్యకి కబురు పెడతాను. లుబా : వొద్దు, వొద్దు, నా మాట విను. వాడొచ్చాడంటే యిల్లు తినేస్తాడు. మీనా : తీంటే తింటాడు. ప్రాణంకంటేనా యేవిఁటి? లుబ్ధి : నాకొద్దంటూంటే వినవుగదా, నువ్వు నా మంచం దగ్గర పక్కేసుకు పడుకో; నువ్వు చదువుకునే భాగవతం పుస్తకం పట్రా; తలకింద పెట్టుకు పడుకుంటాను. (మీనాక్షి వెళ్ళును) యీ ముండ నా యింట్లోంచి విరగడైపోతేనే గాని, యీ పిశాచం వొదిలిపోడు. వేదం చదువుకున్న ముండా కొడుకుని, నా మీదే పడ్డ తరవాత, వీడు బ్రహ్మ రాక్షసి గాని, వొట్టి దెయ్యం కాడు. పోనీ అతడికే ప్రార్థన చేస్తాను. “నా పెళ్లాం మొదటి మొగుడా!” ఆఁ! నా పెళ్లం కాదు లెంపలు వాయించుకుంటాను. “యీ పిల్ల మొగుడా! నువ్వే నిజవ్కైన మొగుడివి. నేను కాను. దాన్ని ముట్టను-తాకను - దాంచేత చాకిరీ అయినా చేయించను. నన్ను రక్షించి, పీక పిసికెయ్యకు; పీక పిసికెయ్యకు; యే పాపం చెయబట్టో దెయ్యానివైనావు. నన్ను చంపావంటే బ్రహ్మ హత్య చుట్టుకుంటుంది. మరి జన్మం వుండదు. బాబూ! నాయనా! తండ్రీ! నా జోలికి రాకు. నీ మావఁగారి పీకనులివెఁయ్యి! ఆ రావఁప్పంతులుగాడి వీకనులివెఁయ్యి! లేకపోతే, (కేకలు, యేడ్పు వినబడును) ఓరి దేవుడా, మళ్లీ వొచ్చాడు కాబోలు (శిష్యుడు యేడుస్తూ పరిగెత్తి వచ్చి లుబ్ధావధాన్లును గట్టిగా కౌగలించుకొనును. మీనాక్షి శిష్యుణ్ణి చీపురుగట్టతో కొట్టబోవును. శిష్యుడు తప్పించుకోగా, దెబ్బలు లుబ్ధావధాన్లకు తగులును.) మీనా : ముండా! నా మోహురు అక్కడపడేస్తావా పడెయ్యవా? నా తాళం యేదే లంజా? లుబా : నన్ను కొట్టేశావేవిఁటే? (శిష్యుడితో) వొదులు, వొదులు, నన్ను ముట్టుకోకే తల్లీ (మీనాక్షితో) దీని అపవిత్రపు వొళ్లు తగిలే చచ్చిపోతాను. నన్ను వొదిలిపించెయ్యి, (మీనాక్షి శిష్యుడి రెక్కలు పట్టిలాగి, బుగ్గ గిల్లును. శిష్యుడు మీనాక్షి చెయ్యి కరిచి పారిపోవును. ) కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 327