ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5

ఇటీవలి దశలో వచ్చిన విమర్శ అన్ని విధాలా భిన్నమైనది. ఇది సాహిత్యంలో అస్తిత్వ వాదాలు దూసుకు వచ్చిన దశ. ఈ విమర్శకు లోతూ, గాఢతా ఉన్నాయి. దీనికి గురజాడ నిలువుతో విభేదం లేదు. స్థూలస్థాయిలో గురజాడదీ, వీరిదీ నిలువు (stand) ఒక్కటే. సాహిత్యానికి సామాజిక బాధ్యత ఉంది. జీవిత చిత్రణలోనూ, భాషలోనూ కూడా అది వాస్తవికంగా ఉండాలి.

పోతే -

వారి పరిశీలనకు కేంద్ర బిందువు గురజాడ పుట్టుక. మనిషి ఎక్కడో ఒకచోట పుడతాడు. అతని భావ వైశాల్యం వల్ల విస్తరిస్తాడు. ప్రపంచమంతటికీ చెందుతాడు. స్థలకాలాలను అధిగమిస్తాడు. దానికి అతని సామర్థ్యం చాలావరకు పనిచేస్తుంది. కొంత వరకూ అతని జాతి స్వభావం, వారి కృషీ పనిచేస్తాయి. భారతీయ సమాజంలో అధిగమించవలసిన వర్ణం, కులం, భాష వంటివి అధికంగా ఉన్నాయి. అవి పుట్టుక తోనే లభిస్తాయి. గురజాడ వెంకట అప్పారావు అనే మనిషి బ్రాహ్మణ అనే కులంలో, వర్ణంలో ఆయన ప్రమేయం లేకుండా పుట్టాడు. అది ఈ సమాజంలో పుట్టిన ప్రతి ఒక వ్యక్తికి సాధారణ పరిస్థితి. అస్తిత్వ వాదుల పరిశీలన ప్రకారం ఆయన కృషి ఆయన పుట్టిన కులం బాగుకే వినియోగింపబడింది. దాదాపు 70-80 ఏళ్లుగా గురజాడ అభిమానులూ, వ్యతిరేకులూ దాదాపు అగ్ర కులాల వారు. ఆ కులాల బయటివారు ఇపుడు ఈ ప్రశ్న లేవనెత్తారు. గురజాడను ఆధునికతకూ, అభ్యుదయానికీ తర్వాత కమ్యూనిజానికీ విగ్రహం చెయ్యబోతే వాటివల్ల మాకేం ఒరిగిందని ఆలోచిస్తున్న వారు లేవనెత్తిన ఈ ప్రశ్న చర్చనీయమైనది.

భారతదేశపు ప్రత్యేక పరిస్థితుల సమగ్ర అధ్యయనానికి ఎంతయినా దోహదం చెయ్యగల ప్రశ్న ఇది. ఇది సరిగ్గా చర్చించబడలేదు. మాకొద్దీ తెల్లదొరతనమని అగ్ర కులాల వారు ప్రకటిస్తే మాకొద్దీ నల్లదొరతనమని తతిమా కులాల వారు స్పష్టం చేస్తున్న తరుణం ఇది. ఆత్మగౌరవం అంతిమ లక్ష్యమంటున్న అణచబడిన, బడుతున్న సమూహాలు వేసిన ఈ ప్రశ్న ఒక మీటింగ్ పాయింట్ ఏర్పరచింది. దీనిలో సమాజం అంతా పాల్గొనే అవకాశం, పరిస్థితి ఉంది. ఆవశ్యకత ఎంతయినా ఉంది. ఇది ప్రస్తుతం బీజ ప్రాయంలో ఉన్న ప్రశ్న. రేపటి తాత్వికత దీని నుంచే పుట్టే అవకాశం ఉంది.