ఈ పుటను అచ్చుదిద్దలేదు

లోకోపకారం చేయడానికి అవకాశవుఁంటుందా? చెప్పడం మరిచి పోయినాను, అప్పుడు మన వెంకటేశం మన దగ్గరే వుండి చదువుకుంటాడు. బుచ్చమ్మ: అలా అయితే మరి నాన్నకి ఖర్చుండదు. నాన్నా అమ్మా వాడి చదువు కోసం దెబ్బలాడ్రు. గిరీశం: నే వొద్దన్నానా? వెంక : నాకో చిన్న గుఱ్ఱబ్బండి కొనాలి. గిరీశం: వేరే నీకు బండీ యెందుకు? మా పిల్లల బండీలో నువ్వు కూడా వెళ్లుదువు గాని, వాళ్లు అల్లర చెయకుండానూ, కింద పడిపోకుండాను చూస్తూ వుందువు గాని. వెంక : అక్కయ్యని పెళ్లాడేస్తారా యేవిఁటి? గిరీశం: మాటవరసకి అని అంటూంటే, మతిపోయినట్లు మాట్లాడతావేవిఁటి? బుచ్చమ్మ: అంతేకద? గిరీశం: అంతేగదంటే, అంతకంటే అదృష్టం నాకు పట్టడం యలాగ? ఆ మాట మీరు అన్నా, నేను అన్నా, మీ వాళ్లు నన్ను తన్ని తగిలేస్తారు. వెంకటేశం గానీ అన్నట్టాయనా, పెయ్యకట్టుతాడు వున్లే వుంది. వెంక :ఓయి నాయనో! (వీపు తడువుకొనును) గుప్ చప్! నే ఆ వూసెత్తను! బుచ్చమ్మ: మానాస్తం, రాంభొట్లు గారి అచ్చమ్మ మీరు వొప్పుకుంటే మిమ్మల్ని పెళ్లాడతానంది. గిరీశం: పెళ్ళాడడవేఁ వొస్తే, అచ్చమ్మనీ, పిచ్చమ్మ నా పెళ్లాడతాను? యప్పటికైనా “ఒకళ్లతో నాకు పనేవిటి? నా బతుకు సుఖవేందో నేను చూసుకుంటాను” అని మీలాంటి దివ్య సుందర విగ్రహమూ, గుణవంతురాలూ, నా మీద కనికరించి “గిరీశంగారూ నన్ను పెళ్లాడండి” అంటే పెళ్లాడతాను గానీ అచ్చమ్మల్నీ, పిచ్చమ్మల్నీ మెడకి కట్టుకుని ఉత్తమ బ్రహ్మచర్యం, లోకోపకారం మానుకుంటాననుకున్నారా యేవిఁటి? వెంక : మంచిపండు పడిపోయింది అందుకోండి. గిరీశం: (పండు తీసి) ఆహా యేమి చాయ! వొదినా మీ వొంటి చాయని వుంది యీ పండు, యిందండి. బుచ్చమ్మ: బిందెలో పడెయ్యండి. తమ్ముడూ దిగొచ్చి బిందయెత్తు. గిరీశం: వాడక్టర్లేదు. నేనెత్తుతానెండి (యెత్తి) ఆహా! యేమి వయ్యారం! (బుచ్చమ్మ నిష్క్రమించును) కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 279