ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయితే -

వారు జీవించిన కాలం ప్రత్యేకమైనది. సమాజం ప్రత్యేకమైనది. వ్యక్తిగత జీవితం ప్రత్యేకమైనది. వారి అనుభవాలు ప్రత్యేకమైనవి. వారి మెదడునూ, హృదయాన్ని రూపొందించిన పుట్టుక, పెంపకం, ఎదుర్కొన్న సమస్యలూ, వాటి పై చేసిన ఆలోచనలూ, కలిగిన ఉద్వేగాలూ, తేల్చుకున్న అంశాలూ, తీసుకున్న నిర్ణయాలూ వేటికవే ప్రత్యేకమైనవి.

ఈ సూక్ష్మాంశాలు పట్టుకుని పరిశీలించితే -

వారి నిలువులోని ప్రత్యేకత అర్థమవుతుంది. ఆ నిలువుకిగల సానుకూల, ప్రతికూలాలు గ్రహించగలుగుతాం. ఆ సానుకూలతను ఆకట్టుకోటానికి ప్రతికూలతలను తట్టుకోడానికి వారు నిర్మించుకున్న సాహిత్య పరికరాలు స్పష్టమవుతాయి. అవి మొత్తం సాహిత్యానికి సమకూర్చిన కొత్తదనాలు కంటబడతాయి. నేర్పరితనం ఎలా సానబట్టుకున్నదీ చూడగలుగుతాం.

ఈ దృష్ట్యా చూస్తే -

గురజాడ నాటి పరిస్థితులేంటి? వాటి నుంచి రూపొందిన వారి నిలువు ఏంటి?

వారి కాలానికి ప్రపంచంలో భావ విస్తరణకి దారులు విస్తరించాయి. భావ విస్తరణకి పట్టేకాలం తగ్గించి. శతాబ్దాలుగా రాజకీయంగా ఒక్కటిగా లేని భారతదేశం భావాలలో, నమ్మకాలలో ఒక్కటిగా ఉంది. ఆచారాలలో, సాంప్రదాయాలలో, ఆలోచనలలో ఒక సారూప్యత కలిగి ఉంది. ఈ దేశానికి దూరం నుంచి వచ్చిన ఆంగ్లేయుల పాలన రాజకీయంగా ఒక్కటి చేస్తోంది. అంతకుముందు ఈ దేశానికి వచ్చిన వారు దాదాపు ఇక్కడే స్థిరపడి, ఇక్కడి సంస్కృతితో ప్రభావితమైన ఈ సంస్కృతిని ప్రభావితం చేసి దానిలో భాగమైపోయినవారు.

అయితే;

పడమటి ప్రపంచం కేవలం లాభార్జన కోసం ప్రపంచమంతా విస్తరించే కార్యక్రమంలో భాగంగానే భారతదేశానికి వచ్చింది. వారిలో వారికి కోట్లాటలలో ఈ దేశంలో ఆంగ్లేయులు విజయం సాధించి పాలన ఆరంభించారు. వారిపై స్థానికులు తిరగబడగా దానిని అణచి వేసి వ్యాపార కంపెనీ పాలన స్థానంలో రాజపాలన ఆరంభమయింది. పడమటి ప్రపంచం నమ్మకాలలో (faith) దాదాపు ఒక్కటే మతమూ, గ్రంథమూ, దేవుడూ కలిగి ఉన్నా, లాభార్జనలో, సంపద పెంపులో మాత్రం ఎవరి జాతి వారిదే అన్న దృష్టికి అలవాటు పడింది.