ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దుకా : ఆకాశంమీంచి ఒచ్చాడుకాడూ? రూపాయిలిచ్చేసి మరీ కదులు.

బైరాగి : మావంటి సాధులతోటి మీకు వాదెందుకబ్బీ, యెవర్ని చూసి నేననుకున్నావో యేమిటో. నీ వంత మమ్మలిని నిర్బంధ పెట్టాలనీవుంటే వొక్కనిముషంతాళు, యింత రాగి తెచ్చుకుంటే వెండిచేసి యిస్తాను.

3వశూ: యేమి వెర్రిముండాపని చేశావోయ్ -బంగారం చేశేవాళ్లకి డబ్బులచ్చంటోయ్, ఆరికాళ్ల మీదపడి కోపం తీర్చుకో.

దుకా : వుండోశ్ యేడిసినట్టేవుంది. (హెడ్ కనిష్టీబు ప్రవేశించును)

హెడ్ : యేమండోయి గురోజీ! మీరు దొరకడం నాకు దేముడు దొరికినట్టుంది. ఇక బతికాను, మీతో కొన్ని జరూరుసంగతులు చెప్పాలిరండి.

బైరాగి : భాయి! మీరు వెనక్కుండండి (పదిమంది శూద్రులును వెనుకకు వెళ్లిపోవుదురు. )

దుకా : నా రూపాయిలు యిచ్చి మరీ మాట్లాడండి.

బైరాగి : నీకు కావలసినంత వేడిచేసిస్తాను, నలుగురిలోను మర్యాదతీసి వేయ్యడం న్యాయమేనా. ఇలాంటి రహస్యాలు పామరులకు తెలియకూడదు.

హెడ్ : (దుకాణాదారునితో) భాయి! నీ రూపాయలు నేనిస్తానుగాని, కేసుమాటేదో జాగ్రత్త చేసుకోనియ్యండి. (బైరాగీవైపు తిరిగి) గురోజీ కూనీకేసు పీకల మీదికి వచ్చింది. కేసు యేబుగ్గీలేనిదే, నాలుగు రాళ్లుతడముకుందామని ఆవేళ రాత్రి ముసలివాణ్ణి గందరగోళం పెట్టాం, రామప్పంతులుగాడు యేదో వాడడిగినంత యిచ్చాంకామని తాస్సీల్దారుకి ఆకాశరామన్న అర్జీకొట్టాడు - వాడొచ్చి కేస్ మళీకదీపి, హాత్‌హూత్తని, ముసలాణ్ణి బెదిరించి డబ్బులాగి వూరుకున్నాడు. తాస్సీల్దారు దగ్గరకూడా రామప్పంతులుకేం పెగిలింది కాదు, దాంతో కలక్టరుకి ఒహ ఆకాశ రామన్న అర్జీకొట్టాడు. దాని మీద అది యినస్పెక్టరుకి రిఫరైంది. వాడు మైరావణాసురుడు. తాస్సీల్దారుకీ వాడికి బలవద్విరోధం దొంగసాక్ష్యం అంతా కూడదీసి పద్మవ్యూహం పన్నేశాడు. నేనూ తాస్సీల్దారూ, కేసు కమ్మీచేశామని రుజువుతెస్తున్నాడు.

బైరాగి : మేముండగా మీకేమి భయమండీ. కోరుటుకు వెళ్లేటప్పుడు యీ వేరు చేతికి కట్టుకుని యీ అక్షింతలు యింటిమీద పడేసి లోపలికి వెళ్లండి. అధికారికి వాగ్బంధము అయిపోతుంది.

హెడ్ : ఆలాగురక్షించు గురూ. మీరు నా పక్షం సాక్ష్యంకూడా పలకాలి. లుబ్ధావధాన్లు మామ గారు ఆ గుంటూరు శాస్త్రులెవరో వాడెక్కడా కనబడకుండా వున్నాడు. వాడుకాని

గురుజాడలు

198

కన్యాశుల్కము - తొలికూర్పు