ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఒకటవస్థలము - లుబ్ధావధానులు యింటిపెరడు

(హేడ్ కనిష్టేబును, లుబ్ధావధానులును మాటలాడుచుందురు)

హేడ్ : నాపత్రం యిచ్చివేస్తే కేసు నీళ్లు కారించివేస్తాను.

లుబ్ధావ: వడ్డీమట్టుకు వదిలివేస్తాను ఆలాగు కటాక్షించండి.

హేడ్ : మళ్లీ మొదటికి వచ్చినారూ?

లుబ్ధావ: నాకు ఏఖర్మం తెలియదు నిరపరాధినిసుమండీ నాయనా?

హేడ్ : యీ కబుర్లు నా దగ్గిర యందుకు చెపుతారండీ? పంతులు చూచారు, కీపర్ చూచాడు, గురోజీగారు చూచారు, గ్రంథం అంతా సంపూర్నంగా ఉన్నది; రిపోర్టు చేస్తినా ఊరి బయట మర్రిచెట్టుకి మీమ్మలిని తప్పకుండా వురిదీసి వేస్తారు.

లుబ్ధావ: మరి వీళ్లకేమి యిచ్చుకోవలెను?

హేడ్ : అంతకు తక్కువకు వప్పరు, యాభై రూపాయలు ఇయ్యండి.

లుబ్ధావ: యిరవయి రూపాయిలిచ్చుకుంటాను.

హేడ్ : పోనియ్యండి ముప్పయిరూపాయలు ఇయ్యండి (అని పత్రమును రూపాయిలును పుచ్చుకొనును)

లుబ్ధావ: డబ్బంతా అయిపోయినది యిక ముష్టికి బయలుదేరాలి.

హెడ్ : డబ్బుమాటకేమి ప్రాణం దక్కింది మరి భయం పడకండి. మీ భార్యా పరారి అయి పోయిందని రిపోర్టు వ్రాశేస్తాను.

(నిష్క్రమించుచున్నారు.)

***

రెండవ స్థలము - లుబ్ధావధానులు పెరటీ గోడ అవుతల

(రామప్పంతులు, దుకాణాదారు, బైరాగియు నుందురు, హేడ్ కనిష్టీబిల్ ప్రవేశించును)

హేడ్ : (గట్టిగా) రండి వెళ్లిపోదాము.

రామప్ప: మీమాట ఫయిసలయింది కాబోలు - మామాట యేమిటి.

హేడ్ : అంతా పైసలు చేసుకొచ్చాను.

రామప్ప: యేమిటి ఫయిసలు చెయ్యడము-నాకంటె యగేశాడు. రెండువందలిస్తేనే కాని కూడిరాదు.

గురుజాడలు

179

కన్యాశుల్కము - తొలికూర్పు