ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాస్త్రాలన్నీ వొప్పుకోవడమే కాకుండా వెధవలు పెళ్లాడకుండా వుండిపోతే దోషమని కూడా చెప్పుతూ వున్నాయి. యిందు విషయమై ఆచార్యులవారు పత్రికకూడా యిచ్చియున్నారు.

బుచ్చమ్మ: అయితే మనవాళ్లంతా వెధవల్ని పెళ్లిచేసుకోకూడదంటారే?

గిరీశం: అదంతా యింట్లో చాకిరీ చేయించు కోవడముకోసరముగానీ మరేమీకాదు. ఝాము రాత్రీ ఉందనగా లేచి మరునాడు రెండు ఝాముల రాత్రిదాకా యెద్దులాగు పనిచేయిస్తారు కదా? ఒక్కపూటకంటె యెక్కువభోజనం చెయ్యనివ్వరుకదా? అప్సరసలాగున యెంత సొగసుగా నున్నా మంచి గుడ్డకట్టుకోనివ్వరు. సరుకు పెట్టుకోనివ్వరు. తుమ్మెద పంక్తుల్లా వుండే జుత్తుకూడా తీసివేస్తారు గదా! ఫర్ ఎగ్జాంపిల్, మీ అక్కయ్యకు ఆ చంద్ర బింబమువంటి ముఖముపైని ఒక కుంకుమబొట్టుంటే త్రినేత్రుడికైనా చూడడానికి అలవి వుండునా. ఆహా! యీ అవస్తచూస్తే నా హృదయం కరిగిపోతున్నది. ఆల్‌రైట్ ప్రపంచములో యింకా యేమి వస్తువులువున్నవి?

వెంకటే: చేగోడీలు.

గిరీశ : డామ్ నాన్సెన్స్-ఎంత సేపూ తిండి విషయమయ్యే ఆలోచిస్తావు. బాచిలర్స్, బ్రహ్మచారులు కూడా వున్నారు. వాండ్లు చెయ్యవలసిన పనియేమిటి?

వెంకటే: వేదం చదువుకోవడం, పెయ్యలకి గడ్డితేవడం.

గిరీశ : నాన్సెన్స్ -అది మీ తండ్రి దగ్గర చదువుకునే విద్యార్థులుకి, బ్రహ్మచారి యొక్క రియల్ డ్యూటీ, అంటే, విధించినపని యేమనగా విధవలను పెండ్లాడడమే. ఇంకా క్రియేషనులో యేమున్నది?

వెంకటే: నాకు తెలియదు.

గిరీశ : రామవరములో వెధవవివాహము చేసుకున్న వాళ్లకల్లా నెల వక్కింటికి నూరు రూపాయిలు యిచ్చి పోషించడముకు విడోమారేజి సభవకటి యున్నది. ఇదివరకు ఐదువేలమంది వెధవలకు వివాహములు అయి పుని స్త్రీలు అయిపోయినారు. ఆల్‌రైట్!! క్రియేషన్ అనేమాట అయినది. ఆ సెంటెన్సు అంతకూ అర్థముచెప్పు.

వెంకటే: మీరొకమాటు చెప్పిన తరువాత నేచెబుతాను.

గిరీశ : ఆల్‌రైట్! ప్రపంచములో దేవుడు ప్రతి వస్తువునూ యేదో ఒక వుపయోగముకొరకు చేసియున్నాడు. చేగోడీ యెందుకు చేసినాడూ?

వెంకటే: తినడముకు.

గురుజాడలు

166

కన్యాశుల్కము - తొలికూర్పు