పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.1 (1918).pdf/5

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూజా పుష్పము

గ్రంథాలయ సర్వస్వము

ద్వితీయ సంపుటము
ప్రధమ సంచిక

పూవు (పద్యములు)


1
చెలియల సిగలలోఁ ♦ జెలువారు పూవ
పడతుల జడలపైఁ ♦ బవళించు పూవ
సఖుల ముచ్చటముళ్ళ ♦ సవరించు పూవ
లలనావతంసమ్ము ♦ లను గుల్కు పూవ
పోవటే! మాతల్లి ♦ పూజకో పూవ!
2
అఱవిచ్చి సిగ్గులఁ ♦గరఁగిన పూవ
మొగ్గవై మోజులు ♦ మొలిపించు పూవ
పూచి శోభనములఁ ♦ బొదివిన పూవ
దళముల కౌగిలిం ♦ తలఁ జొక్కు పూవ
పోవటే! మాలెల్లి ♦ పూజకో పూవ!
3
చిగురాకు మరుఁగునఁ ♦ జెలువారు పూవ
కొమ్మ మాటునఁ ♦ గొనలెత్తు పూవ
ఎండకు కాగని ♦ యెలపూత పూవ
వెన్నల౯ పేరని ♦ వెలుతురు పూవ
పోవటే! మాతల్లి ♦ పూజకో పూవ!
4
కడుపులో తేనెలు ♦ కల కన్నెపూవ
తనువున గంధముల్ ♦ దయివారు పూవ
రెక్కల నంధాలు ♦ గ్రక్కెడు పూవ
మోమున లావణ్య ♦ ములురాలు పూవ
పోవటే! మాతల్లి ♦`పూజకో పూవ!
5
పసుపు కేసరములు ♦ మిసిమించు పూవ
నిగనిగ సొగసుల ♦ బిగువోని పూవ
పెండ్లిండ్లు పాలించు ♦ ప్రేమంపు పూవ
వీరుని కంఠాన ♦ విప్పారు పూవ!
పోవటే! మాతల్లి ♦ పూజకో పూవ!
6
కాపుకన్నియ కొప్పుఁ ♦ గైసేయు పూవ
ఉపవనాల నుయాల ♦ లూగెడి పూవ
తోటకంచెల వన్నె ♦ తోఁ బూచు పూవ
అడవి డొంకల నంద ♦ మయి యొప్పు పూవ
పోవటే! మాతల్లి ♦ పూజకో పూవ!