పుట:Grandaalayasarvasvamu sanputi 7sanchika 1jul1928.pdf/7

ఈ పుట ఆమోదించబడ్డది

మనదేశపు ప్రజలలో చాలమంది ప్రైమరీ పాఠశాల చదువుతో చాలించెడువా రున్నారు. మరికొందరు లోవరుసెకండరీ చదువుతో చాలించుదురు వీ రందరు పెల్లెటూండ్లయందును, బస్తీలందును ఏదియో సామాన్యపు వృత్తుల నవలంబించి జీవించువారై యున్నారు. వీరిలో పెక్కుమంది ధనములేనివారు. వీరికున్న కొద్దిచదువు అనర్థ హేతువుగా నున్నదిగాని లాభించుటలేదు. వీరికన్న ఎక్కువమంది విద్యాగంధ మేమియు లేనివారు. ఈ రెందుతరగతుల వారి జ్ఞానాభివృద్ధిని చేయగల ధర్మసంస్థలు స్థాపించుట ఆవశ్యకర్తవ్యము. ఈసంస్థలుఎవ్వి? వానిని నడుపగలవా రెవరు? వానికి సొమ్ము ఎచ్చటనుండి రాగలదు? అను ప్రశ్నలకు జవాబు నిర్ధారణ చేసికొనవలసియున్నది

ఈ సంస్థలు ఏవ్వి? యనునది మొదటిప్రశ్న.

పల్లెటూండ్ల వెంటను బస్తీల వెంటను వెళ్ళి ప్రజల కవసరమగు యంశములనుగూర్చి వారికి తెలియు విధమున యుపన్యసించగల సంచార భొధకులుండుట మొదటి యవసరము. వీరి యుపన్యాసములకు సాధకముగా నుండుటకు చులకనభాషలో వ్రాసిన కరపత్రముల ప్రచురించుటయు, మ్యాజిక్కులాంతరు సహాయమును చేకూర్చుటయు అవశ్య కర్తవ్యము.

ఇట్టి ప్రయత్నము నీమధ్య మన ఆంధ్ర విశ్వవిద్యాలయము వారు ఉద్యమించిరి గాని అది ఫలోన్ముఖమైనట్లు కనుపడదు. ఆంధ్ర గ్రంథాలయోద్యమ పక్షమున ఈపని ప్రారంభించి సాగించినచో మన ప్రజలయందు దట్టముగా వ్యాపించియున్న అజ్ఞానము నశించును. ప్రజల యజ్ఞానమునే యాధారము చూచుకొని వారివలన అన్యాయముగా ప్రాతినిధ్యమును సంపాదించు యుపద్రవము ఈమూలమున నిర్మూలము కాగలదు. ప్రజల యార్థికస్థితిని బాగుపర్చుకొను మార్గములు ఈమూలమున ప్రజల కలవడును. పరదేశముల స్థితిగతులును, అచ్చటి ప్రజలు అభివృద్ధి జందెడి సాధనములును ఈవిధానము ననుసరచి ప్రజలకు బోధించి ఆవిధముగ వారల నభివృద్ధికి దేవచ్చును.