పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/55

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

37

ఈ విధముగ చేయబడిన కార్నిజీ యొక్క పైధర్మముల మొత్తము మన రూపాయిలలో 30 కోట్ల 52 లక్షల 50 వేల రూపాయలు కాగలదు. ఈ మొత్తమును తలంచిన యే ఆంధ్రుని గుండె ఝల్లుమనకుండును? కార్నిజీ యొక్క ఐశ్వర్వమువాత మన దేశములో నెల్లరు చదువవలెను. హిందువులలో “అపుత్రస్య గతిర్నాస్తి" యని నమ్మకము గలదు. తాను ధనమెద్విధముగా సంపాదించినను కొడుకనేవాడున్నాడా దానికి కత౯యని చూచుచుండుట హిందువుని స్వభావము. అట్టివాని కణ౯ములకు కార్నిజీ బోధ బాధకరముగా నుండవచ్చును. కాని ఆయన దార పుత్రాదులకు తగినంత మాత్రమిచ్చి శేషించినది ధర్మమునకు వినియోగించవలె ననుచున్నాడు, ఆంగ్లేయ పత్రికాధిపతులలో సుప్రసిద్ధుడైనట్టి కీతి౯శేషుడయిన స్టెడు కార్నిజీకినిచ్చిన సలహాల ను, కార్నిజీ స్వయముగా వ్రాసిన యనేక విషయములను మన యాంధ్ర యువకులు ముఖ్యముగా జదువవలెనని బరోడా పత్రికాధిపతుల యభిప్రాయమై యున్నది.

అమెరికాలోని గ్రంథ భాండాగారములకు కార్నిజీ 1918 సంవత్సరమునందు చేసిన ధర్మముల యొక్క మొత్తము 4 లక్షల అరువదివేల నవరసులు. ఇతరులిందు నిమిత్త మిచ్చినది 4 లక్షల నవరసులు ఇది గాక లక్ష 68 వేల 655 గ్రంధములును, గ్రంథభాండాగారముల నిమిత్తము 12 స్థలములును, 101 భవనములును ఇంక చిల్లర ధర్మములనేకములును చేయబడినవి. 1913 సంవత్సరాంతమునకు ఆండ్రూ కార్నిజీ యొక్క ధర్మముల మొత్తము 18 కోట్ల 24 లక్షల రూపాయిలై యుండెను.

పెద్దిభొట్ల వీరయ్య, బి.ఏ., బి.యల్.


పుస్తక భాండాగారములు

వానినభివృద్ధి జేయవలసిన పద్దతులు.

మన విద్యయొక్క స్థితి.

మనదేశమునందు జనులలో ననేకులు విద్యాగంధము లేనివారు, విద్యతోనంతగా నవసరము లేదని తలంపబడు స్త్రీల మాటయటుండనిచ్చి, పురుషులలో సహితము రాజకీయోద్యోగములం బ్రవేశింప నెంచువారును, తమ జీవనోపాధికి విద్య యత్యంతయవసరమని తలచెడి కొలది మందియును, మాత్రమే తమబిడ్డలకు విద్య నేర్పించుచున్నారు. కావున దేశమునందు బహుసంఖ్యాకులు విద్యావిహీనులేగాక నిరక్షరకుక్షులునై యున్నారు.

మన దేశముయొక్క స్థితి.

దేశమునందు జ్ఞానము వ్వాప్తమై జనులు మౌఢ్యమను బోనడుపవలయునన్న చిన్న పిల్లలనిమిత్తమై పాఠశాలలును, కర్మకారులు వ్యవసాయదారులు మొదలగు వారి నిమిత్తమై రాత్రి పాఠశాలలను పెట్టవలెను. ఇదివరకే కొంత చదువ నేర్చినవారి కొఱకై యప్పుడప్పుడు యుపన్యాసములు నిప్పించుటకై ప్రయత్నములు గూడ జరుగవలసి యున్నవి. తానే దేశమునందు జన్మించినదియు, తన దేశముయొక్క నైసర్గిక స్థితి, శీతోష్ణాది మార్పులు, పాడిపంటలకును వ్యాపారమునకును గల సౌకర్యములు, జనులు, వారి యాచార వ్యవహారములు మున్నుగాగల యంశములను తెలిసికొని యానందించ లేనంతటి దౌర్భాగ్యస్థితివంటిది మానవునకు మఱియొకటి యుండబోదు. ఏదేశమైనను అట్టి బలపరాక్రమశీలురగు నాగరికాగ్రేసరులగు జాతులు గలిగినదైనను, తన పూర్వపు ఔన్నత్యమును మఱచి తన పూర్వపురుషుల సాధుచరితంబులను పఠింపక తన్మూలకముగ ధైర్యసాహసములకు గోల్పోవుట కిచ్చగింపదు. మన ప్రస్తుత విద్యా విహీనావస్థకు కారణము మన పూర్వచారిత్రమును మఱచి పోవుటయేయని వేఱుగ చెప్పనేల!