పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/52

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

రి యింటనే గలదని యాతడు తృప్తి జెందుచుండెను; తర్వాత స్వయంకృషిచే మిక్కిలి ధనవంతుడైనప్పుడు సహితము తన యభిప్రాయమును మార్చుకొనజాలనని కార్నీజీ నుడివియున్నాడు. ఈప్రకారము బాయిలరు వద్ద ఒక సంవత్సర కాలము పనిచేసి ఓహియో టెలిగ్రాఫు కచ్చేరీలో తంత్రీ వాత౯లను బట్వాడా చేయు కుర్రవాడుగా ప్రవేశించెను. అచ్చటనున్న కాలములో టెలిగ్రాఫు పనులను దెలిసికొని శీఘ్రకాలములో నెలకు ముప్పది రూపాయిల జీతము సంపాదింపగల టెలిగ్రాఫు ఉద్యోగమును రైలు స్టేషనునందు సంపాదింపగలిగెను. ఆ జీతమునకు అతడు చాల సంతృప్తినిజెంది యానందమును బొందుచుండెడివాడు, అప్పుడు తన తండ్రి యొక్క గృహమును తాకట్టు బెట్టి ఆదామ్సు యక్స్ప్రెస్సు కంపెనీలో 10 భాగములను కొనెను. వ్యాపార ప్రారంభమున కిదియే కార్నీజీ యొక్క ప్రధమ ప్రయత్నము. అనుభవశాలి యగుటచేత నావ్యాపారములో భాగములు కొనినచో లాభము రాగలదని ఊహింపగలిగెను. దూరదృష్టితో నాలోచించి తనవద్ద సొమ్ము లేనప్పటికి నప్పుచేసి వ్యాపారమున జొరబడెను. సాహసము లేనిదెట్టి స్వల్పకార్యమైనను సాధింపజాలము గదా.

రైలు కంపెనీవారు కార్నీజీ యొక్క తెలివితేటలను గనిపెట్టి వెంటనే పిట్సుబర్లు డివిజనునకు సూపరింటెండెంటు పనినిచ్చిరి. ఆకాలమున అమెరికాలో జరిగిన దేశీయ యుద్ధమునందు మిలిటరీ రైలు రోడ్డును టెలిగ్రాఫులను కాపాడుటకు కార్నీజీ నియమింపబడెను. యుద్ధమును ప్రత్యక్షముగ సందర్శించుటకవకాశము కలిగి యందలి ఘోరములాతని మనసునకు దృఢముగ నాటుటచేత నిప్పటికిని యుద్ధవాత౯ యతనికి కణ౯కఠోరముగ నుండును.

ఆ యుద్ధకాలమున కార్నీజీ వాషింగ్టనులో పనిచేసి తిరిగి పిట్సుబర్లునకు రాగా, నిద్రకనుగుణ్యమైన రైలుబండ్లను కనుగొనిన ‘వుడురపు' అను వానితోకలసి భాగస్థుడుగ జేరి బ్యాంకిలో కొంత సొమ్మును బుణము తెచ్చిఁ పెనిసీల్వేనియా' రోడ్డు మీద కూడ తమ బండ్లనే వాడుక లోనికి రప్పించగలిగెను. ఆడమ్సు కంపెనీ కంటే ఈ కంపెనీలో కార్నీజీకెక్కువ లాభము గలిగెను.

1861 సంవత్సరములో పెన్సిల్వేనియాలో కనిపెట్టబడిన కిరసనాయిలు వ్యాపారమునకై తానప్పటికి నిలవజేసిన 8000 నవరసులను వినియోగించి యానూనెదొరకు క్షేత్రము నొకదానిని కొనెను. కార్నీజీ యదృష్టమంతయు అతని నప్పటినుండి యుచ్ఛస్థితికి దెచ్చినది. ఇనుప వ్యాపారములు జేయు అనేక కంపెనీలలో భాగస్థుడై 1868 సంవత్సరములో ఆంగ్లేయ దేశములో ప్రశస్తమైన బెస్మరు ఉక్కు తయారు చేయుపద్ధతిని పరిశీలించుటకై పోయియుండి అమెరికాకు వచ్చిన పిమ్మట, ఉక్కురైళ్ళను తయారుచేయుటకు యంత్రశాలలను స్థాపించెను. రైళ్ళకు కావలసిన యినుపసామగ్రిని తానే తయారుచేయించవలెనని దీక్ష వహించి కార్నీజీ ఉక్కు యంత్రశాలలను స్థాపించియుండెను. తన పట్టుదల ప్రకారము తన పనులకు కావలసిన సామానులనన్నిటిని తన యంత్రశాలలోనే తయారుచేయగలిగి యితరులపై యాధారపడి యుండనందులకు కార్నీజీ పొందిన యానందమును మనమూహింపజాలము. 1883 సంవత్సరములో మరియొక ఉక్కు యంత్రశాల కధికారియయ్యెను. కార్నీజీ ఉక్కు యంత్రశాలల కంపెనీ పేరబరగు వ్యాపారములందు 50 లక్షల నవరసులను మూలధనముగా కార్నీజీ యుంచగలిగెను. 1892 వ సంవత్సరములో బొగ్గునుసి కంపెనీ నొకదానిని సంపాదించెను. 1900 సంవత్సరము నాటికి తన కంపెనీలలో మూలధనము కోటిన్నర నవరసులుగు జేసెను. తనకు 62 సంవత్సరముల వయసు వచ్చుసరికే కార్నీజీ వ్యాపారముల నుండి చాలించుకొని 50 కోట్ల నవరసుల స్థితితో తులతూగుచుండెను.

కార్నీజీ యీవిధముగ లాభమును సంపాదించగలుగుటకు ముఖ్యకారణము, వ్యాపారములో పనిచేయు వారికి తన లాభములో కొంతపాలు పంచియిచ్చుటయని బోధించుచున్నాడు. మరియొక రహస్యమేమనగా తెలివిగలవాడెచ్చట కన్పించినను వానిని తగువిధముగా ప్రోత్సాహపరచి లాభములో భాగమునిచ్చి తన వ్యాపారములో చేర్చుకొనుచుండెడివాడు. ఎవరైన భాగస్తుడు కాలము చేసిన యేడల నెల దినములలో వాని వారసులకు