పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/28

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

శాఖాసంఘముల నేర్పరచి తల్లి గ్రంథాలయము ఆ శాఖల మూలమున తన పుస్తకమునెక్కువగ ప్యాప్తి నెందునటుల జేయవలెను. ఆ శాఖాసంఘములయందు స్వల్పమూల్యముగల గ్రంధములను మాత్రముంచి, విశేష మూల్యము గల గ్రంధముల నెల్ల తల్లి భాండారమునుండి తెప్పించుకొనవచ్చును. కేంద్ర గంధాలయములను ముఖ్యప్రదేశములయందు స్థాపించి, పల్లెటూళ్ళయందుగల చిన్న గ్రంథాలయములను వాటికి శాఖాసంఘములుగ నేర్పడుటవలన ఇట్టి లాభము లెన్ని యోగలవు.

సంచార పుస్తకాలయ స్థాపనము వలన జనులకనేక యుపయోగములు గలవు. కొత్త పుస్తకముల నొక పెట్టిలో పెట్టి, వాటిని జాగ్రతపరచి గ్రామస్ధులచే చదువునటుల జేయటకు ఒక మనుజుడుతో గ్రామముల కెల్ల 'మన గ్రంధములను బంపవచ్చును. ఈ ప్రకారము బంపుటకు వివిధ గ్రంథములు గలిగిన కొన్ని పెట్టెలనుంచితిమేని, ఒక గ్రామమునందున్న ఓ పెట్టియందలి గ్రంధములను జదివిన పిమ్మట దానిని వేరొక గ్రామమునకు బంపి, ఆగ్రామమునకు వేరొక పెట్టెను బంపవచ్చును. ఈ ప్రకారము మిక్కిలి స్వల్పమగు వ్యయముతో అమితమగు ఉపకారమును మనము పల్లెలవారికి జేయగలము.

గ్రంధాలయము యొక్క పని విద్యను గరపుయేగాక వినోదపరచుటగూడనై యున్నది. గంధాలయముల నెన్నడును ద్రొక్కి చూడని మనుజుల నాకర్షింపుటకు క్రీడలు మిక్కిలి సాపర్ధ్యము గలవి. ఇంతియగాక ఒకేపనిని చాలసేపు చేయుచుండుట చేత విసుగు చెందిన మనసు గల వారికి క్రీడలు బుద్ధిమాంద్యమును హరించి సంతోషమలవరచుటకు సిద్దౌషధముల వంటివి. కావున గ్రంధాలయములయందు వినోదపరచునట్టి క్రీడలనుగూడ నేర్పాటు జేయుట మిక్కిలి యావశ్యకమై యున్నది.

ఆలోచించిన కొలదిని, గ్రంథాలయము యొక్క ఉపయోగము నభివృద్ధి జేయుటకనంతములగు మార్గములు దొరకుచునేయుండును. గ్రంథాలయమునందున్న గ్రంధములను గూర్చియు ఆది చేయుచున్న పనిని గూర్చియు తరుచుగా ప్రకటనలను బంచి పెట్టవలయును; ఇంతియగాక దానినిగూర్చి తరుచుగా ఇతరులతో జెప్పుచుండవలెను.

గ్రంథాలయములను ఇన్ని విధములచే జనులకుపయుక్తములగు నటుల జేయుటెందులకు అటుల జేయనియడల హానియేమి? అని మీరు ప్రశ్నింపవచ్చును. జనులకుపయోగకరమగు నటుల ధర్మగ్రంథాలయముల నుంపనియెడల, ఆవి పుస్తక దుకాణములని పిలువ దగి యుండును గాని ధర్మగ్రంధాలయములని పిలుచుటకావంతమైన నర్హతగలిగియుండవు. కావున ఆంధ్రదేశమున గల ప్రతి గ్రంథాలయమువారును ఆలోచింపవలసిన సంగతులు రెండు. తమ గ్రంధాలయమును పుస్తక దుకాణమని పిలువదలచుకున్నారా? లేక ధర్మగ్రంధాలయమని పిలువవలతురా? ఈ ప్రశ్నలనే ప్రతి గ్రంధాలయమువారును తీవ్రముగ నాలోచింపవలెను.