ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నించుచుండె నిట్లు రాముండు గంగానది నుత్తరించి శుభసస్యసమృద్ధంబు
లగువత్సదేశంబులు విలోకింపుచు వ్యాఘ్రాదిక్రూరమృగంబులం దోలుచు
నాహారయోగ్యంబు లగువరాహఋశ్యరురుపృషతసంజ్ఞమృగంబుల వధించి
వానిం గొని బుభుక్షితులై ప్రొద్దు గ్రుంకునంతకు నొక్కవనస్పతి డాయం జని
వరుణప్రియ యగుసంధ్య నుపాసించి జానకీవల్లభుండు సౌమిత్రి నవలోకించి
యి ట్లనియె.

1104


క.

ఏనిశ సుమంత్రవిరహిత, మై నేఁ డిట మనకుఁ దోఁచె నారాత్రి బహి
స్స్థాననివాసంబున కిది, మానుగ మొదలిటిది గాదె మనుజశరణ్యా.

1105


తే.

అనఘ నేఁ డాది గాఁగ నిత్యంబు రాత్రు, లందు సమధిజ్యధన్వుల మై సహస్ర
గతుల నరయుచు నిద్దురఁ గాచి యుండ, వలయు సీతకు భయ మింత గలుగకుండ.

1106


ఆ.

మఱియు నేఁడు మొదలు మనుకులవర్య ని, త్యంబు రాత్రులందు స్వార్జితంబు
లైనపర్ణతృణము లవనిపైఁ బఱిచి వ,సింత మొక్కచోటఁ జేరుదనుక.

1107


వ.

అని పలికి మహార్హశయనోచితుం డైనకౌసల్యానందనుండు సీతాలక్ష్మణసహి
తంబుగా నవ్వనస్పతిమూలంబున నధ్యాసీనుండై సౌమిత్రితోఁ బుణ్యకథాప్ర
సంగంబులు సేయుచు నంతకంతకుఁ బ్రసంగవశంబునం బెక్కుతలంపు లూర
వెండియు లక్ష్మణున కి ట్లనియె.

1108

రాముఁడు దశరథాదులఁ దలంచుకొని దుఃఖించుట

మ.

అనఘా యీనిశ మేదినీవిభుఁడు శోకాకల్పితస్వాంతుఁ డై
ననుఁ జింతించుచు నేమి దోఁపక నిరానందంబుగా నుండున
ట్లనె కైకేయి సపత్నిపుత్రుఁడు మహారణ్యోర్వికిం బోయె నే
ననిశం బింకఁ గృతార్థ నైతి నని యాహ్లాదించుచుండుం గదా.

1109


తే.

మఱియు నద్దేవి మాతులమందిరమున, నుండి వచ్చినతనపుత్రు నొప్పఁ జూచి
రాజ్యకారణమున మహీరమణుప్రాణ, ములను నిఁకమీఁద హరియింవఁ బూనదు గద.

1110


తే.

అకట వృద్ధుఁ డనాథుఁడు నగునృపుండు, కామభారావసన్నుఁడు గాన నేను
లేనిచోఁ దాను గైక కధీనుఁ డగుచు, నేమి సేయంగఁ గలఁ డిప్పు డింకఁ జెపుమ.

1111


తే.

కైక యీవాక్యరశ్మిచేఁ గట్టువడిన, మనుజనాథునిమతివిభ్రమంబుఁ జూచి
రాజకులవర్య యర్థధర్మముల కంటెఁ, గామము గరీయ మని తోఁచెఁ గాదె నాకు.

1112


తే.

కానిచో నుర్వి నెంతదుష్కర్ముఁడైన, సుతుని సుగుణాభిరతుని సువ్రతుని నృపుని
కరణి నెవ్వాఁడు విడుచు నకారణముగ, లక్ష్మణా యది కామధర్మంబు గాదె.

1113