ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పుంగవుండు కాలోచితకృత్యంబులు దీర్చి లక్ష్మణదత్తం బైనగంగానదీజలంబుఁ
గ్రోలి సుమంత్రవిరచితం బైనపర్ణతల్పంబుఁ బత్నీసమేతంబుగా నధివసించె
నప్పుడు లక్ష్మణుం డన్నచరణంబుల గంగోదకంబులం గడిగి తడి యొత్తి కొంత
దడవు శుశ్రూషఁ గావించి పదంపడి ధనుర్ధరుం డై కొలిచి యుండె గుహుండు
ను సూతసహితంబుగా సౌమిత్రితోడ సంభాషించుచు ధనుర్ధరుం డై
యుండె నంతఁ గొంతరాత్రి చనిన యనంతరంబ భ్రాతృరక్షణాయత్తచిత్తుం
డై యదంభంబున నిద్ర వేఁగించు చున్నలక్ష్మణుం జూచి సంతాపసంతప్తుం డై
గుహుం డి ట్లనియె.

1026

గుహుఁడు లక్ష్మణుఁడు నిద్రపోకయుండుటను జూచి పరితపించుట

చ.

అతులితవైభవోన్నతి మహాసుకుమారుఁడ వయ్యు నీవు నీ
గతి నడురేయిఁ గా ల్నిలిపి కంటికి నిద్దురఁ గాచి యున్కి నా
మతికి విషాద మయ్యెడి క్షమావరపుత్ర త్వదర్థ మిందుఁ గ
ల్పిత మగుపర్ణతల్పమునఁ బ్రీతి సుఖస్థితిఁ బవ్వళింపవే.

1027


ఆ.

అనఘచరిత కష్ట మనుభవింపఁగ నాకుఁ, జెల్లుఁ గాక నీకుఁ జెల్లు నయ్య
ఘనసుఖోచితుఁడవు కడుసుకుమారుఁడ, వతిమృదుండ వవనిపాత్మజుఁడవు.

1028


చ.

అనవరతంబు నీదుకృప నందినవారము గాని సజ్జనా
వనగుణధుర్య మేము కడవారము గాము సు మయ్య యీనిశం
బనివడి బంధువు ల్సఖులు భ్రాతలు జ్ఞాతులు గొల్వ నిద్ర మే
ల్కనియెడునంతదాఁక మిముఁ గాచెదఁ గంటికి ఱెప్ప కైవడిన్.

1029


మ.

ధర నెవ్వానికృప న్నితాంతయశము న్దర్మార్థకామంబులుం
బరమైశ్వర్యము నాకుఁ గల్గె సుఖసంపల్లాభముం గంటి నా
నరవర్యుం డగుజానకీప్రియునకన్న న్సత్ప్రియుం డెవ్వఁ డు
ర్వరలో లేమి యథార్థ మింతయు సుమిత్రాపుత్ర చర్చింపఁగన్.

1030


తే.

నరవరాత్మజ గహనగోచరుఁడు నైన, నాకుఁ దెలియని దీవిపినంబునం దొ
కింతయును లేదు బల మోపినంత గలదు, శంక విడిచి నిద్రింపుము శయ్యయందు.

1031


ఉ.

నా విని లక్ష్మణుండు కరుణంబుగ నాగుహుఁ జూచి పల్కు నో
భూవినుతప్రతాప విను ముజ్జగ మేలుట కర్హుఁ డైనయీ
భావజసన్నిభుం డిటులు పర్ణతలంబునఁ బవ్వళింప నా
కేవిధి నిద్ర వచ్చు సుఖ మేటికి జీవిత మేల చెప్పుమా.

1032

లక్ష్మణుఁడు రామునివనవాసమును గుహునితోఁ జెప్పి దుఃఖించుట

ఆ.

అనఘ ధర్మవిదుఁడ వైననీచేత రక్షితుల మైనమాకు మది నొకింత
యైన భీతి పుట్ట దన్యుఁడ వీవు గా, వాదరింపఁబడితి నదియె చాలు.

1033