ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

తవిలి రామునిఁ గైకకు దాసునిఁగ నొ, నర్పవైతివి యటు లైన నగరమందు
బైక్షవృత్తిఁ జరించుచు భవనమందె, యునికిఁ జేసిన వీక్షించుచుండుదుఁ గద.

906


వ.

మఱియు నాహితాగ్ని యగువానిచేత దర్శపూర్ణమాసరూపపర్వంబునందు
వ్రీహిగతతుషజాలం బెట్లు రక్షోభాగత్వంబుచేత నిర్దిష్టం బగు నట్లు కైకచేత
రాముండు స్వరాజ్యావస్థానంబువలనను స్వగృహావస్థానంబువలనను వినిపా
తితుం డై యథేష్టంబుగా రాక్షసభాగత్వంబున వినియుక్తుం డయ్యె నని పలికి
వెండియు ని ట్లనియె.

907


క.

గజరాజగమనుఁ డమల, ద్విజరాజముఖుండు వినుతవీర్యుండు భృత
ద్విజుఁ డగునాతనయుఁడు జన, కజతోఁ గూడి యెటు నిల్వఁగా నేర్చు వనిన్.

908


క.

కట్టా కైకేయికిఁ గాఁ, బుట్టి యెపుడు దుఃఖములను బొందనివారిం
గట్టిఁడితనమున నిప్పుడు, నట్టడవికిఁ బంప నీకు న్యాయమె యధిపా.

909


వ.

అని దూఱ వగచి యంత నిలువక.

910


చ.

తరుణులు రూపవంతులు నుదంచితమూర్తులు రామలక్ష్మణు
ల్వరఫలకాలమం దిటు వివాసితు లై రటు రత్నహీను లై
బరువడిఁ గందమూలఫలభక్షకు లై యలకాననంబులోఁ
గర మతిదీనవృత్తి నిలుఁ గానక నెట్లు వసింతు రక్కటా.

911


ఉ.

తమ్ముఁడు ప్రీతితో బహువిధంబుల సేవ యొనర్చుచుండ నం
దమ్ముగ సీతఁ గూడి ప్రమదంబున నిష్టసుఖైకశీలుఁ డై
సమ్మతితో నయోధ్యఁ గల సర్వజనంబు నుతింప నాధిప
త్య మ్మొనరించుకాలము జనాధిప యెప్పుడు చూడఁ గల్గెడిన్.

912


వ.

అని యాసపెంపునం బలికి వెండియు.

913


ఉ.

క్రన్నన రామలక్ష్మణు లరణ్యము వెల్వడి వీటి కింకఁ దా
రెన్నఁడు వత్తు రిష్టసుఖ మెన్నఁడు గాంతురు భానుమత్కులం
బెన్నఁడు తేజ మొందు మనుజేశ్వర మత్పృథుదుఃఖశోక మిం
కెన్నఁడు దీఱు బంధుజను లెన్నఁడు గాంతు రనంతమోదమున్.

914


క.

పంకజదళనయనుని నక, లంకేందుసమానముఖుని రమణీయగుణా
లంకృతుని నాకుమారుని, నింక విలోకింపఁ గలదె యీజన్మమునన్.

915


క.

వనవాసము సల్పి రయం, బునఁ దమ్ముఁడు గొల్వ సతిని ము న్నిడికొని చ
య్యన మరల వచ్చురామునిఁ, గనుఁగొను భాగ్యంబు నాకుఁ గలదో లేదో.

916


ఉ.

పొందుగ రామలక్ష్మణులు భూమికుమారియు రాజవీథి నా
నందముతోడ రాఁ గని మనంబునఁ గోర్కులు పల్లవింపఁగాఁ
జందురుఁ గన్నయోషధులచందము నొంది పురీకులాంగన
ల్బృందముఁ గట్టి ప్రీతిమెయి నెన్నఁడు గాంతు రభీప్సితార్థముల్.

917