జనంబంతయు మనోవాగగోచరం బైనదుఃఖంబు నొందు నీవలన నిక్ష్వాకు
కులోచితం బైనయశం బంతయుఁ బరిక్షీణం బయ్యె రామునకు సహచరుం
డగుటం జేసి లక్ష్మణుం డతని విడువంజాలక వెనువెంట నరణ్యంబునకుం
జను నంతఁ గుమారవనవాసంబును భర్తృమరణంబునుం దలంచి శోకించి
కౌసల్య ప్రాణంబులు విడువం గల దంతట సుమిత్ర నన్నును గౌసల్యను రా
మలక్ష్మణశత్రుఘ్నులం గానక శోకంబున సహగమనంబుఁ జేసి పంచత్వంబు
నొందు నిట్లు కౌసల్యాసుమిత్రలను నన్నును రామలక్షణశత్రుఘ్నులను దుఃఖ
నిమగ్నులం జేసి నాచేతను రామునిచేతను విడువం బడిన శాశ్వతం బైన
యిక్ష్వాకుకులం బాకులంబుగాఁ బరిపాలించుచు సుఖం బుండుము భరతు
నకు రామవనవాసంబు ప్రియం బయ్యెనేని గతజీవితుండ నైననాకుఁ బ్రేత
కృత్యంబు సేయుటకు నతం డర్హుండు గాఁడు మే మందఱ మరిగిన పిదప నీవు
లబ్ధకామితవై పుత్రునిం గూడి విధవారాజ్యంబుగాఁ బరిపాలింపు మీవు రాజ
పుత్రీవ్యపదేశమాత్రంబున మద్గృహంబుఁ బ్రవేశించుటం జేసి నాకుఁ బాపాత్ము
నకుంబోలె నపయశంబును మహాజనసమక్షంబున ధిక్కారంబును సర్వభూతం
బులయం దవమానంబును సంప్రాప్తం బయ్యె నని పలికి వెండియు నమ్మహీ
రమణుండు శోకోద్రేకంబున ని ట్లనియె.