ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దార వయి రాజధర్మ, క్రూరత్వం బెఱుఁగ వేల కువలయనేత్రా.

176


క.

పలుకులఁ దీపును ధర్మముఁ, గలిగి హృదయమందుఁ జాలఁ గలుషముఁ గ్రౌర్యం
బలవడఁగ నాఁటినుండియు, మెలఁగున్ నీమగఁడు దెలియమిన్ వంచించెన్.

177


చ.

జనపతి నిష్ఫలం బయిన సాంత్వము నీపయిఁ జేర్చి యిప్పు డ
త్యనుపమరాజ్యరూపకమహార్థముచేఁ బ్రథమద్వితీయనె
మ్మన మలరించెఁ గానియెడ మామను జూచుటకై భవత్సుతుం
బనిచి ధరాసుతాపతికిఁ బట్టముఁ గట్ట నుపక్రమించునే.

178


చ.

అతివ వృథాప్రసాంత్వుఁ డగునానరనాథకులోత్తముం డనా
రతము సుఖోచితం బయినరాజ్యమునందు వసుంధరాత్మజా
పతి నభిషిక్తుఁ జేయు నిఁక బాంధవసంఘసమన్వితంబుగా
క్షితిని సజీవ వయ్యు గతజీవిత వైతివి మాట లేటికిన్.

179


క.

సుతునకు హితంబు నా కు, న్నతహర్షము నీకు మే లొనర్చుతలఁపు నీ
మతిఁ గలిగిన నభిషేకముఁ, జతురత విఘ్నితముఁ జేయఁ జను నీ కబలా.

180

రామునికిఁ బట్టాభిషేకంబు జరుగుట మంథరవలన విని కైకేయి సంతసిల్లుట

వ.

బాలా దశరథుండు నీకుఁ బతివ్యపదేశంబుచేత శత్రుం డగు ఛన్నహృదయుం
డగునతండు ఋజుస్వభావ వైననీచేత సర్పశిశుపోషయిత్రిచేతంబోలె హితా
చరణేచ్ఛచేతఁ బ్రతిచ్ఛన్నాంతర్విషం బైనసర్పంబువోలె నుత్సంగంబునందు
బరిధృతుం డయ్యె నుపేక్షితంబు లైనశత్రుసర్పంబులచేతం బోలె బాపస్వభా
వుండును వృథానాంత్వుండు నగునద్దశరథునిచేత నిత్యసుఖోచిత వైన నీవు
సపత్నీపుత్రాభిషేకరూపాపకారంబునఁ బుత్రమిత్రబంధుసహితముగా హత
వైతి వింకనైన వివేకంబు గలిగి తత్కాలోచితోపాయవిచారకుశలవు గావున
శీఘ్రంబున రామాభిషేకంబునకు విఘ్నంబుఁ గావించి భరతుని నిన్నును నన్ను
నుం బ్రోవు మని పలికిన విని యక్కేకయరాజపుత్రి రామాభిషేకకథాశ్రవణ
సంజాతపరమానందరసపూరితహృదయ యై చంద్రరేఖాలంకృత యైనశరద్ర
జనియునుం బోలె నభిరామదర్శన యై యొప్పుచు రయంబున లేచి పర్యంకమ
ధ్యంబునం గూర్చుండి వికసితమనోహరముఖారవింద యై కన్నుల నానంద
బాష్పధారలు గ్రమ్ము దేర సరసమణిప్రభాపటలశోభితం బై యొక్కదివ్యాభర
ణం బొసంగి యి ట్లనియె.

181


క.

చెలియా పరమప్రియ మగు, నల జనకసుతాధినాథునభిషేకము సొం
పలరం జెప్పితి దీనికిఁ, గల ప్రత్యుపకార మేమి గావింతు నిఁకన్.

182

మంథర దుర్బోధనల విని సరిగా దనుచుఁ గైకేయి దానిని సమ్మతిపఱచుట

వ.

అని యుత్సాహంబు దీపింపఁ బలికి వెండియు.

183