ఈ పుట ఆమోదించబడ్డది

గోప దంపతులు.

1. ఆకర్షణము.

ఆంధ్రదేశమున జిరకాలమునుండి చారిత్రప్రాముఖ్యము వహించిన పట్టణములలో విశాఘపట్టణ మొకటి. దానికి రెండు కోసులదూరమున గోపాలపట్టణమను చిన్నగ్రామము గలదు. ఆగ్రామముగుండ జెన్నపురినుండి కలకత్తాకుబోవు నినుపదారి పోవుచున్నది. అదికుగ్రామమేయైనను దానిసమీప మందున్న చిట్టడవులలోనికలప చింతకాయ మున్నగు వస్తువుల యెగుమతికొంత యందుజరుగు చుండును. కావున, నందొక రైల్వేస్టేషను నిర్మింపబడియున్నది. అది విజయనగర సంస్థానములోని పల్లెకావున దఱుచుగా దత్సంస్థానోద్యోగులు వచ్చుచుందురు. వారిలో నొకరిద్దఱందే కాపురముందురు. ఇనుపదారి దానిగుండబోవుటచే దత్సంబంధోద్యోగులును గొందఱుందురు. అప్పుడప్పుడాప్రాంతముల బ్రయాణముసేయు వర్తకుల నరికట్టి పాటచ్చరులు కొందఱు బాధించుచుండుటయు గలదు గావున, నందు గొందఱు రక్షకభటులును దదధికారులు కొందఱును గాపురము చేయుచుందురు. వీరుగాక కరణకరణకప్రభృతులే యందలి ఘనుల సంఘములో జేరి యుందురు.