పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/70

ఈ పుట ఆమోదించబడ్డది

అన్నాంబిక

63

వర్ధమానపురం కోటలో, కోటచుట్టూ గ్రామాలలో, శిబిరాలలో సిద్ధంగా ఉన్నాయి. అనేకులు మండలేశ్వరులు తమతమ సైన్యాలతో బాసటగా ఉన్నారు.

అలాంటి శ్రీశ్రీ వర్ధమానపురవరాధీశ్వర, సంతతార్చిత శశిమౌళి, రాయజగదాళ, మహామండలేశ్వరులైన లకుమయారెడ్డి మహారాజాధిరాజు కడనుండి యువరాజు వివాహానికి లగ్నపత్రిక అంత వైభవంగా రాకపోవుటెట్లు?

“వెనుకటి వివాహప్రయత్నం సాధారణం. ఆ ముహూర్తము తప్పిపోవటమే మంచిదయింది” అనుకొన్నారు కోటారెడ్డి ప్రభువు. లగ్న పత్రికతో అంత వైభవంగా వర్ధమానపుర రాజపురోహితులు రావడం ఎంత ఉచితము! ప్రభువు ఎంతో గర్వపడినాడు.

పురోహితునితో భట్టులు, నర్తకులు, సంగీతవిద్వాంసులు, వేదవేదాంగ పారంగతులు, పండితులు, జంత్రవాద్యమేళాలవారు వేంచేశారు. ఆదవోని రాజపురోహితుడు అంత వైభవంగానూ ఎదురేగి, సగౌరవంగా వర్ధమాన రాజపురోహితుని కోటలో ఒక హర్మ్యంలో ప్రవేశపెట్టించాడు.

పండితసభలు జరుగుచున్నవి. ఆదవోని పట్టణం అంతా శృంగారింప బడింది. ఉత్సవాలు జరుగుచున్నవి. శుభముహూర్త నిశ్చయానికే ఇంత అఖండోత్సవం జరుగుతూఉంటే ఇంక వివాహం దేవేంద్ర వైభవంతో జరిగి తీరుతుందని ప్రజ లనుకొన్నారు.

స్వస్తి శ్రీ శాలివాహన శక 1183, దుర్మతి సంవత్సర వైశాఖ శుద్ధ --- బుధవారంనాడు, రోహిణీయుక్త కన్యాలగ్నమందు శ్రీశ్రీశ్రీశ్రీ సమస్త ప్రశస్తి సహిత, భండనోత్తుంగ, తురగరేవంత, పరబలసాధనం పతిహితా చరణ, గండరగండ, గండభేరుండ, సత్యహరిశ్చంద్ర, శౌచగాంగేయ, శరణాగత వజ్రపంజర, సకలజనస్తుతి, పరనారీదూర, బంధుచింతామణి, సూర్యోదయ రాజ్యసముద్ధరణ, సకలవిద్యావినోద, విభవపురందర, వివేక చతురానన, విప్రజనాశ్రయ, చతుర్ధకులకుముదినీరాజ్యవర్ధనచంద్ర, పెనమనుంగోత్ర వడ్లూరిపురాధీశ్వర గడికోట మల్లవంశ భానులైన శ్రీశ్రీశ్రీ కోటారెడ్డిప్రభువులవారు తనయకు వివాహం నిశ్చయం చేశారు.

ఆ మహోత్సవసమయంలో కార్తాంతీక శ్రేష్ఠుడు కౌండిన్యగోత్ర పవిత్రుడు సోమనాథ భట్టులవారు, ఆ ముహూర్తప్రాశస్త్యం ఆదవోని మహాప్రభువునకు, శ్రీవర్ధమాన రాజపురోహిత పెద్దిభట్టులవారికి వినిపించి, వేయిన్నీ నూటపదహారు సువర్ణాలు, అనేక దుశ్శాలువలు, మూడుమారుతుల భూమి అలంకృత గృహము, నూరుగోవులు బహుమానము లంపినవాడాయెను.

అన్నాంబిక ఒక రహస్యగవాక్షంద్వారా ఈ దృశ్యం యావత్తూ చూస్తూ వెడనవ్వు నవ్వుకొన్నది. కోసగి మైలిని ప్రాణం చూరగొన్న వాడు,