పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/327

ఈ పుట ఆమోదించబడ్డది

320

గోన గన్నా రెడ్డి

అన్నాంబికాదేవిని తలపోసుకొంటూ ఆ బాలికను రత్నఖచిత సువర్ణ సింహాసనంపై కూర్చుండబెట్టి సర్వస్వము ఆ బాలికకు పూర్ణార్పణ చేయడానికి తానే సిద్ధం అయి ఉన్నప్పుడు, ఈ పూజ్యులందరూ అంతమధురాతి మధురకార్యము తనకు ఇష్టము లేదని అనుకొనుట ఎలా కలిగినది!

ఇంతలో శ్రీకోటారెడ్డి మహారాజులంగారు మంత్రితోకలసి తమరాక తెలియజేసి లోనికి విచ్చేసినారు. కోటారెడ్డి ప్రభువుకు గన్నారెడ్డి ఎదురేగి వారిరువురకు నమస్కరించి, సగౌరవముగా కొనివచ్చి ఉచితపీఠాల అధివసింపచేసి, తానున్నూ ఒక పీఠం అధివసించాడు.

కోట: ప్రభూ! తమకు సౌకర్యాలన్నీ జరుగుతున్నవో, లేదో?

గన్నా: చిత్తం ప్రభూ! మా ఇంటిలో జరిగినవాటికన్న ఎక్కువగా సౌకర్యాలు ఏర్పాటు చేసినారు.

కోట: ప్రభూ! తమచరిత్ర అంతా శ్రీ చక్రవర్తులు, మహారాజులంవారు మాకు తెలియజేసినారు. నాకు ముఖ్యస్నేహితులై మా తండ్రిగారిని ఆదవోని సింహాసనం అధివసింపజేసిన శ్రీ బుద్దారెడ్డి మహారాజుల కుమారులు, మిమ్మును గూర్చి అన్యధాగా ఆలోచించాను మందమతినై.

గన్నా: మహాప్రభూ! మీ రిలా ఆలోచించితే మేమంతా వేసినఎత్తు పారిందనటానికి ప్రబలసాక్ష్యం ఒక్క చక్రవర్తికి, శ్రీ రుద్రదేవ మహారాజులకు, శ్రీ శివదేవయ్య దేశికులవారికి తక్క, మా కుట్ర ఇంకొకరికి తెలియదు. ఇందులో తమరు ఒక్కరేకాదు పొరపడింది.

మంత్రి: గన్నారెడ్డిప్రభూ! తమశౌర్యము అర్జునునికే పాఠాలు నేర్పుతుంది. ఇంతవరకు ఈలాంటి పరమాద్భుత విక్రమచరిత్ర వినలేదు మా మహాప్రభువుగారికి విచారము అంతమైనది.

గోన: మంత్రిగారూ! మీ రెవ్వరూ ఏమీ అనుకోవద్దు. ఆ దినాలలో కాకతీయసామ్రాజ్యాన్ని విచ్ఛిన్నంచేసే శక్తులు విజృంభించాయి. రహస్యముగా జన్నిగదేవులు రుద్రదేవ చక్రవర్తిపై కత్తికట్టినారు. అందుకు ప్రతీ అస్త్రంగా మేమాపని చేసినాము. మా పినతండ్రిగారి మాటలకులోనై మీ మహారాజు కొన్ని నెలలుతటపటాయించారు. అంతకన్న వేరులేదు. మాతండ్రిగారియందున్న ప్రేమకొద్దీమహారాజుగారు నాయందు వాత్సల్య ముంచవలసిందని మనవి.

మంత్రి: ప్రభూ! మారాజకుమారి సౌభాగ్యవతి అన్నాంబికాదేవి సకల సద్గుణగరిష్ట, అప్రతిమాన సౌందర్యఖని, అపరవిద్యాశారద. ఆ దేవిని తమకు వధువుగా అర్పించ మా మహారాజులవారు సంకల్పించి తమ్ము ప్రార్థిస్తున్నారు.