పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/322

ఈ పుట ఆమోదించబడ్డది

ఏదిదారి

315

ఆ వార్త వినటంతోటే అన్నాంబిక మోము కలకలలాడి పోయింది. వాన కురిసిన వెనుక ఏరు పొంగినట్లాబాల ఉప్పొంగిపోయింది. సంపూర్ణ జ్యోత్స్నలు విశ్వము నిండినట్లు ఆమె మనస్సున శాంతి నిండినది.

“ఏమిటి మా అక్కే వస్తూంట! ఒహో! ఏమి అదృష్టము! అమ్మగారూ! మనదేశం కన్నుల కైలాసం కావాలి! మన ఆదవోని సౌందర్యరాశి అనిపించాలి! నేను మీ అంతఃపురంలో ఉంటాను. నా నగరు చక్రవర్తికోసం అలంకరిస్తాను! అమ్మగారూ! నా నగరుప్రక్క తోట ఆవలఉన్న అతిథి నగరు, మహారాజుగారికి విడిది! ఈ రెండూ నేను అలంకరింపిస్తాను. నాకు అనుజ్ఞ దయచేయండి!” అని దివ్యానందగీతంలా ఆమె తన తల్లిని వేడుకొన్నది.

తన బంగారుతల్లి ఆనందముతో ఆకాశగంగలో బంగారు కమలంలా వికసించడంచూచి మహారాణికూడా ఆనందపూర్ణ అయింది.

“అల్లాగే నాతల్లీ! అంతా నీ యిష్టం. నీ ఆనందం నా ఆనందంకాదా కన్నతల్లీ?” అని మహారాణి ప్రియమార కూతును కౌగలించుకొని మూర్థము ముద్దాడి తన నగరుకు వెళ్ళిపోయెను.

అది మొదలు దాసీజనులు ఎడతెరపి లేకుండా అన్నాంబికాదేవి ఆజ్ఞను ఆ రెండు నగళ్లు సౌందర్యపరమావధులుగా అలంకరించారు.

నగరంలోని రాజకుటుంబాల బాలికలు నాట్యంచేయడం, రాచకన్నెలు సంగీత ప్రదర్శనాలు చేయడం, సంగీత కళాభిజ్ఞులయిన వారకాంతలు కొందరు మేలుకొలుపుల గీతాలు పాడుట అన్నాంబికయే రచించి వారికి నేర్పింది.

అన్నాంబిక తల్లి గారి నగరులో ఒక భాగంలో తాను విడిదిచేసెను.

నగరం అంతా అలంకరించారు. ఆదవోని రాజ్యమంతయు అలంకరించినారు. రాజపథం పొడుగునా పందిళ్ళు, సత్రాలు, పశువైద్యశాలలు, అశ్వవైద్యశాలలు, నరవైద్యశాలలు, తోలుబొమ్మల నాటకాలు, వీధినాటకాలు, నృత్య ప్రదర్శనాలు ఏర్పాటయినవి.

ఇంక మూడుదినాలకు రుద్రదేవ చక్రవర్తి ఆదవోని వస్తుందనగా, రుద్రదేవి ఒక పరిచారికకు కమ్మనిచ్చి అన్నాంబికకు పంపెను.

చెల్లీ! నువ్వూ నేను కవలపిల్లలము. నాకు అందరాని జీవితానందఫలాలు నీవి. నిన్ను కౌగలించుకొని, నీమోముచూచి, ఇప్పుడు నాజన్మసర్వస్వమూ నిండిన నా ఆనందాన్ని నీకు అర్పించడానికి వస్తున్నా! ప్రేమమయీ! నీ అక్క రుద్రమ!” అని ఆ యుత్తరము!”