పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/285

ఈ పుట ఆమోదించబడ్డది

278

గోన గన్నా రెడ్డి

శివ: తన్ను ఓడించి రాబోయేవాడు రాక్షసుడు కాజాలడనీ, ప్రజలను రక్షిస్తాడనీ ఆ రాణికి నిర్థారణగా తెలియునా?

రుద్ర: ఇవన్నీ తలచుకుంటోంటేనే నాకు ఆవేదన కలుగుతో ఉంటుంది. పరమశివుడు మానవలోకాన్ని ఇన్ని కష్టాలతో ఎందుకు ఉద్భవింప జేశాడు? ఒకరు రాజ్యాధిపతులా, ఒకరు గంగిరెద్దుదాసరులవంటి బిచ్చగాండ్లు!

శివ: బిచ్చగాండ్లు అయి పడేకష్టాలు ఎక్కువ ఏముంది? రాజ్యాధికారులు పడని కష్టాలు ఏమున్నాయి? మహారాజా! సర్వవిశ్వంలో ఈ మనుష్యుడే జ్ఞాన ఉపాధి. అతడే ‘ఏమి?’ అనే ప్రశ్న వేసుకొంటున్నాడు. భక్తులు, జ్ఞానులు, అవతారపురుషులు కష్టాలలో కుంగిపోయి మానవజాతిని ఉద్ధరించడానికి అనేక ఆవేదనలకు లోనవుతారు. బుద్ధుడు చావు, ముసలితనం, రోగం చూచి అవి లేకుండా చేయాలని ప్రయత్నించి చివరకు ప్రపంచం మాయ, అది తెలుసుకున్న వారిని కష్టాలు ఏమీ చేయవు అని తీర్మానించుకున్నాడు. బీదవారికే మోక్షం సుకరం అని తెల్పడానికి కాబోలు, రాముడు శబరి ఎంగిలి తిన్నాడు. శ్రీకృష్ణుడు కుచేలునికి ప్రాణ స్నేహితు డయ్యాడు. అయినా ఏదో మార్పులతో ప్రపంచం అలానే ఉంది.

రుద్ర: గురుదేవా! మనుష్యుల గుంపులు ఎల్లాఉన్నా ప్రత్యేకవ్యక్తి పరమాత్మను తెలిసికొనడమే మహాకర్మ అవుతుందికాదా?

శివ: నిజం తల్లీ! అయినా నీ చుట్టుపక్కల ప్రపంచం చూచి దాని సంతోషాలలో, బాధలలో ఒకటౌతూ, నువ్వు ప్రేమిస్తూ, ప్రేమించబడుతూ ప్రపంచం నిజమనుకుంటూ, కాదనుకుంటూ, ఒక దివ్యనాటకంలో పాత్ర అవుతూ, చరించటం ఎంత విచిత్రమైన విషయం?

రుద్ర: అందుకే ‘నువ్వు నిష్కామంగా కర్మచేయి, ఫలం నాకు వదలు’ అని శ్రీకృష్ణభగవాను డన్నది.

శివ: అదేగా పాశుపతం చెప్పేది తల్లీ! ఇంతకూ జీవితమహాయుద్ధం ముందర, ఈ అఖండ ఆత్మయుద్ధం ముందర మనం ఒనరించే యుద్ధాలు దివ్విటీ ముందర దీపాలవంటివి.

రుద్ర: చిత్తం.

శివ: చిత్తమని నిస్పృహచెంది వెళ్ళకు! మన పౌరుషాలు, మన జ్ఞానాలు, మన ఖ్యాతులు, మన ఆవేశాలు దేహయుద్ధానికీ, ఆత్మయుద్ధానికీ కూడా ఉపకరణాలు. ఏయుద్ధంలోనైనా మనమే విజయం పొందాలి. ఎవరికివారే నరులు, తక్కినవారు ఉపకరణాలు. ఎవరికివారే పరమశివులు, తక్కినవారు పాశుపతాస్త్రాలు, ఎవరికివారే పశుపతులు, తక్కినవారు పశువులు!