పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/281

ఈ పుట ఆమోదించబడ్డది

274

గోన గన్నా రెడ్డి

అంగరక్షకులుగా ఉండిరి. వల్లయనాయకుడు అశ్వరక్షకుడుగా ఉండెను. మారంరాజు, ప్రోలంరాజు, దారపనాయుడు, మారినాయుడు కవచ రక్షకులుగా ఉండిరి.

మొదటి కోటయైన కంపకోటను రక్షింప ప్రసాదాదిత్యనాయుడు తన వంతుగానూ, రెండవ మట్టికోటను రక్షింప చాళుక్య వీరభద్రుడు తన పైననూ వేసుకొన్నారు. మూడవ రాతికోటను రక్షింప జాయపసేనానిని చక్రవర్తిని నియమించెను. లోని నగరుకోట రక్షింప చాళుక్య మహాదేవరాజు నియమింపబడినాడు.

ప్రసాదాదిత్యుని పుత్రుడైన రుద్రసేనాని నగరపాలకుడుగా, తూర్పుద్వారాల రక్షకుడుగా ఏర్పాటయ్యెను. నాగచమూపతి పడమటిద్వారాల రక్షకుడుగా, పైకిపోయే సేనల కధిపతిగా నియమితుడైనాడు. మున్నూరు కాపు కులజులు, సకల సేనాపతి పట్టసాహిణి, పడికము బాప్పదేవ మహారాజు ఉత్తరపు ద్వారాలకు కోటలలోని సైన్యాల కాయుధాలు అందీయడానికి ఏర్పాటయినారు. దక్షిణపు ద్వారాలకు, సేనల భోజనాదికాలకు బెండపూడి ప్రోలయమంత్రి నియమితుడైనాడు.

భూమికోటకు ఎనిమిదిగవనులు ఒక్కొక్కదిక్కుకు రెండు రెండు గవనులున్నాయి. పదునెనిమిది దిడ్లు - మూలకు మూడు, దిక్కుకు ఒకటి, తూర్పునకు మాత్రం మూడు చొప్పున - ఏర్పాటు చేయించినది రుద్రమదేవి.

కంపకోటకు గవనులు నాలుగు, దిడ్లు ఎనిమిది ఉన్నవి. రాతికోటకు గవనులు నాలుగు దిడ్లు ఎనిమిది చేర్చిన దామె. రాతికోటకు లోతట్టున సోపానాలు పెట్టించినది. రాతికోట అలంగముమీద బంధువులైన వీరవరులు కాపున్నారు.

పిల్లలమర్రినుంచి వచ్చిన రేచెర్ల బేతయ బంధువులైన వెలమవీరులు కంపకోట కావలికాచుచుండిరి. వారికి బాసటగా గార్ల నుంచి వచ్చి రేచర్ల వీరు లుండిరి. బుక్క మాచయరెడ్డి గద్వాల సామంతుడు తన సైన్యాలతో మట్టికోట తూరుపు గోడపై ఉత్తరపుదిక్కున ఉండెను. గురుగుంట సోమప్ప నాయకుడు మాచయరెడ్డి దక్షిణంగా ఉండెను. గోపిరెడ్డి అమరచింతేశ్వరుడు ఆయనకు దక్షిణంగా ఉండెను. చక్రవర్తిచే అనుజ్ఞాతుడైన, వృద్ధుడయిన జన్నిగదేవసాహిణి తన రాజ్యం అంబయదేవునికి అప్పగించి వీరులతో మట్టికోట దక్షిణ పశ్చిమకుడ్యములపైన బురుజుల పయిన నిలచినాడు.

కందనోలు ప్రభువు ముప్పడిప్రభువు మట్టికోటకు ఈశాన్యదిశను బురుజులపై నిలిచినారు. రాతికోటకు లోతట్టున ఇటుకకోట కట్టించినాడు చాళుక్య వీరభద్రుడు.

కొమ్మ ఒక్కింటికి ఇద్దరు, బురుజుకు ఏబదిమంది, దిడ్డికి నూర్వురు, గవనులకు ఏనూర్వురు వీరులు నిలచిరి. అంగకు ఇద్దరు ముందువరసను, వారికి బాసటగా ఎనమండుగురు వెనుకను ఉన్నారు.