పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/200

ఈ పుట ఆమోదించబడ్డది

కాకతమ్మ

193

మహారాజు శిబిరాలు స్కంధావారంమధ్య ఉంటాయి. దాని చుట్టూ నిరంతరం అప్రమత్తతతో అంగరక్షకులు కాపలాకాస్తూ ఉంటారు. స్కంధావారంతో పాటు గోపాలకులు వేలకొలది గోవులను, వర్తకులు విపణివస్తువులను తీసుకొని వస్తారు. వేలకొలది కుంభకారులు, రజకులు, మంగలివారూ కూడా వత్తురు. వంట చేయుటకు గొల్ల లుందురు.

ఆంధ్రసైన్యం కదిలిపోవు ఒక మహా పురములా ఉన్నది.

12

గోన గన్నారెడ్డి మహావేగంతో విజయవాడకడ కృష్ణ దాటాడు. కృష్ణ ప్రక్కనే ఇరవై మైళ్ళూ ప్రయాణించి ధాన్యకటకపుకోట తాకినాడు. తమ్ముడు విఠలభూపతి ఇంకా రాలేదు. గన్నారెడ్డి తన మామూలు విధానాన్ని రాత్రి వచ్చి కోట ముట్టడించాడు.

ఏయుద్ధాని కాయుద్ధంలో తన్ను తారసిల్లిన ప్రత్యేక పరిస్థితులు ఆలోచించి గన్నారెడ్డి వ్యూహరచన చేస్తాడు. తా నెంత గజదొంగ అయినా సార్వభౌమవంశం వారికిగాని, వారిదగ్గిర బంధువులకుగాని ఆపద రాకూడదు అని మొదటినుండీ తన పవిత్రధర్మంగా ప్రతిజ్ఞ చేసుకొన్నాడు. అందుకు ఎవరు వ్యతిరేకించినా ఓర్చలేడు. ఆ ధర్మాన్ని వ్యతిరేకించినవాడు ఎంత బలవంతుడైనా గన్నయ్య ఏమీ సందేహించక, అతన్ని ఎదిరించి నాశనము చేయవలసిందే! అతనికి కోపంవస్తే ఒకలక్ష గన్నారెడ్లుగా మారిపోతాడు. ఎక్కడ చూచినా తానే! అంతకోపములోనూ ఏమాత్రమూ ఉచితజ్ఞత, సమయస్ఫూర్తి మరువడు. అప్పు డా శక్తులు ఇమ్మడియై భాసిస్తాయి.

ఆ రెండువేల సైన్యంతో ధాన్యకటక నగరంపై ఒక వైపున ఒత్తిడి ఎక్కువచేశాడు. తనవారు పదునేనువందలమంది నాపనికి చాలించి, తక్కిన అయిదువందలమందినీ కోటచుట్టూ నియోగించెను. ఆరాత్రి గన్నయ్య ఎంత సైన్యంతోవచ్చి కోట తాకినాడో పేర్మిడిరాయనికిగాని, తెఱాల కాటయ్యకుగాని తెలియదు. ‘గన్నారెడ్డి వచ్చి ముట్టడించా’ డని కేకలు వేయించి గన్నారెడ్డి లోకం అంతా చాటినంతపని చేశాడు.

పేర్మాడిరాయుడు, కాటయ్య ఇద్దరు ప్రభువులూ ఏపక్కఅయితే గన్నయ్య కోటముట్టడింపు ఎక్కువ సాగించాడో ఆ ప్రక్కనే అశ్వాలపై వచ్చి చేరారు.

పేర్మాడి: గన్నారెడ్డి మనపై వచ్చిపడ్డాడేమిటి?

కాటయ్య: ఆ రాక్షసునికి నీతి, నియమం ఉందా మహారాజా!

పేర్మాడి: వీడు అసాధ్యుడు. పట్టినపట్టు విడువడు. ఏలాగు?