పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/186

ఈ పుట ఆమోదించబడ్డది

కాకతమ్మ

179

“నేను ఇష్టపడినంతకాలం.”

“ఎవడో మా తోడల్లుడు ఒకడువచ్చి నిన్నెత్తుకుపోకుండా వుంటాడు గనుకనా!”

“అందాకా అక్కమొగుడే దిక్కు.”

“ఆసి, నీ ఇల్లు బంగారకానూ, నువ్వు మీ ఆయన్ను ఏ ఉత్సవంలోనో అమ్ముకు చక్కావచ్చేటట్లున్నావు!”

“మా ఆయన్ను నేను ఎందుకమ్ముకుంటాను! మా బావనే అమ్ముకుంటా, కావలసినంత మూల్యం వస్తుంది!”

“మీ అక్క నీతో దెబ్బలాడదూ!”

“మొగుణ్ణి అమ్మగల నాకు మా అక్క అక్కగాదా?”

“నువ్వు అమ్మనన్నావుగా, అలాగే మీ అక్కా అమ్మడానికి ఇష్టపడదేమో?”

“ఇద్దరం అమ్ముక వచ్చి లాభాలు చూసుకుంటాం!”

“అమ్మో అయితే పారిపోవాలి!”

“ఆఁ! అది సులభమనే నీ ఉద్దేశం! మేము గజదొంగల్ని అమ్మగల సింహదొంగలం!”

అక్కిన పగలబడి నవ్వినాడు. “అమ్మయ్యో, ఇంకెక్కడ దాక్కోవడం?” అన్నాడు.

“అక్క ఒళ్ళో” అంటూ, తుఱ్ఱుమని పారిపోతూ, ‘అదిగో అదే నీగది!’ అని తనగదిలోనికి వెళ్ళి మాయమై తలుపు వేసుకుంది. ఆమె చూపించిన గదిలోనికి పోయి అక్కిన పాన్పుచేరి ఆలోచిస్తూ, స్వప్నాలుకంటూ నిదురకూరినాడు.

ఆ మరునాడు ఉదయం, తెల్లవారగట్ల నే లేచి అక్కినప్రగడ ఊరి చివరకు పోయి, స్నానాదికాలు జరిపి, సంధ్యావందనంచేసి, తిరిగి సూర్యోదయం అవుతూ వుండగానే మేనమామగారి ఇల్లు చేరాడు. ఆతడు లోనికివచ్చి బట్టలు మార్చుకొని, తన పరివారంలోని చారులు తెచ్చిన కొన్ని రహస్యవిషయాలు విని, వారికి తగు సమాధానాలు అందిచ్చినాడు. అతని పనులు తీరగానే మరదలు సీతా, చిన్నమరదలు కల్యాణీ బావగారిదగ్గరకు వచ్చారు. కల్యాణి తన చదువూ, పాటలు బావగారికడ ప్రదర్శించింది. అటువెనుక సీత వీణ తీసుకొనివచ్చి బావగారిని తన గాన విద్యలో తేల్చివేయ నారంభించింది.

మరదలు కంఠంలో అప్పుడే ఒదుగులు ఏర్పడుతూ ఉన్నవి. సాంస్కృతిక గీతాలు, ఆంధ్రపదాలు, రాగాలాపన, తానము ఆంధ్రులసొమ్ము. అవన్నీ సీతమ్మ సౌరభాలు సేకరించుకొంటున్న పుష్పముకుళంగా బావగారికి పాడి వినిపించింది.