పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/160

ఈ పుట ఆమోదించబడ్డది

గజదొంగ

153

వేషంతో ముందుగా అన్ని విషయాలు విచారించి మన జైత్రయాత్రావిధానం నిశ్చయం చేస్తాను. నాతో ముప్పదిమంది అపసర్పులుంటారు. నేను వారిద్వారా వివిధజట్టులవారికి సందేశా లందజేస్తాను. సబ్బప్రభువు నాతో వుంటాడు. అందరూ అప్రమత్తులుగా వుండండి. మనకు యధాప్రకార సాంకేతికాలలో ‘కాచపాత్ర’ అనే సాంకేతికం కొత్తది” అని సభ ముగించాడు.

గోన గన్నయ్య తర్వాత తన ముఖ్యనాయకులతో ఆలోచనా మందిరాన సంప్రతించి యుద్ధయాత్రావిధానంలోని తక్కిన అంశాలన్నీ బోధించాడు.

8

మేడిపల్లినగరం గోదావరీ తీరానకు ఆరు గవ్యూతులలో వున్నది. జొన్న, పత్తి, కందులు, పెసలు, మినుములు, వులవలు, అలచందులు, బొబ్బర్లు పంట పండే బంగారంవంటి గోదావరి వండ్రుభూములమధ్య మేడిపల్లినగరం తోటలతో, పూలవనాలతో వెలిగిపోతూ వున్నది.

మేడిపల్లిని కాచయనాయకుడు పరిపాలిస్తూ వున్నాడు. కాచయనాయకుడు నిడుదప్రోలు చాళుక్య ఇందుకేశ్వర మహారాజుకు సామంతుడు. పరాక్రమవంతుడైన సేనాపతి. చాళుక్య సేనాపతియై కళింగ ప్రభువులు సింహాచలం దాటకుండా యుద్ధంచేసి అనేకమార్లు తరిమివేసిన వీరుడు. కాకతీయ మహాసామంతులైన చాళుక్యులకు సామంతుడై అడవి కోయదొరలను భయ, భక్తి, స్నేహాలతో అదుపాజ్ఞలలో వుంచి, ఆ గోదావరీ తీరారణ్య ప్రదేశాల శాంతి నెలకొల్పి అడవి వస్తువులు దేశాల కెగుమతిచేయిస్తూ అనేక లక్షల మాడలను తన ధనాగారాన్ని నింపుతూ వుంటాడు.

అతడు గండ్రగొడ్డలితో మహాయుద్ధం చేయగలడు. ఆ గండ్రగొడ్డలికి రెండువైపులా పదును వున్నది. ఆ గొడ్డలిని ఖడ్గంగా మహావేగంతో వుపయోగించి ఎంతటి వీరునితలనైనా ఆకాశానకు బంతిలా ఎగరగొట్టగలడు. ఆ గొడ్డలి తలకట్టునకు భల్లశిరంకూడా వుండడంచేత, విరోధుల గుండెల్లో భల్లంలా పొడిచి వారిని హతమార్చగలడు. అతని గొడ్డలికి చిరుగంట లున్నాయి, దంతపుపిడి వున్నది. రత్నాలు పొదిగిన ఆ పిడితో వజ్రసదృశమై దర్శనమాత్రాన శత్రువుల గుండె లవియచేస్తూ వుంటుంది ఆ గొడ్డలి.

కాచనాయకుని పరాక్రమం ఎదుట నిలబడలేని కళింగాధిపతులు, ఈ రాక్షసుని తమ దెసకు తిప్పుకోవాలని చాలా ప్రయత్నించి విఫలమనోరథులయ్యారు. అంతటితో వారు తమ ప్రయత్నం మానుకోలేదు. ‘మహావీరులు బానిసలై మరొకరిక్రింద సామంతులై వుండడము వీరపురుషలక్షణం కాదనిన్నీ, సంపూర్ణస్వాతంత్య్రంతో మహారాజై, సార్వభౌముడై చాళుక్యాది ప్రభువులకు