ఈ పుట ఆమోదించబడ్డది

41. తే. అర్జునా ! యోగమున భ్రష్టులైనవారు
సుకృతపరు లేఁగులోకముల్‌ సొచ్చి పెక్కు
వత్సరము లుండి పుణ్యులైశ్వర్యవంతు
లైన వారిండ్ల నుద్భవమందుచుంద్రు.

42. తే. అట్లు గాదేని ధీమంతులైన యోగ
వరులయిండ్లనె జన్మంబు వడయుచుంద్రు;
ఎంతయో దుర్లభము గాదె యిట్టి జన్మ
మిలను సామాన్య జనులయందెవరికైన

43. తే. అటులు జన్మించి పూర్వదేహములఁ గలిగి
నట్టి బుద్ధి యోగంబు తామందుచుంద్రు;
మరల సంపూర్ణయత్నంబు జరిపి యోగ
మందు సంసిద్ధిఁ బొందుదురవనిజనులు.

44. తే. వివశు లయ్యును దద్యోగవిషయమందె
వారు చరియింతు రభ్యాసవశముచేత;
యోగజిజ్ఞాసులుం గూడ నుర్వి విజయ
మందుచుంద్రు శబ్దబ్రహ్మ మధికరించి

45. తే. కాన, నిర్ధూతకిల్బిషుండైనయత్న
వరుఁడనేకజన్మంబులఁబడసి, తనకుఁ
గలిగియుండినపాపముల్‌ తొలఁగఁబుచ్చి
శ్రేష్ఠమైన యీయోగసంసిద్ధిఁ జెందు.

46. తే. యోగి, తపసులకంటెను నుత్తముండు
జ్ఞానవంతులకంటెను ఘనుఁడు, మఱియుఁ
గర్మములఁ జేయువారలకంటె నధికుఁ
డగుట నర్జున! యోగి వీవగుదుగాక!