ఈ పుట ఆమోదించబడ్డది

17. ఆ. ఆత్మయందు శుద్ధమౌ మనోబుద్ధిని
ష్ఠలు నెలంగ నిరతి సలుపువాఁడు
కల్మషముల వీడి జ్ఞానంబుచేఁ బొందు
జన్మరహితమైన సత్పథంబు.

18. తే. విద్యయును వినయముఁ గల్గు విప్రులందు
గోవులందు నేనుఁగులందుఁ గుక్కలందు
గుక్కలను దినుచండాల కోటియందుఁ
బండితులదృష్ఠి చను సమభావముననె.

19. తే. మనసు నిల్చు నెవ్వనికి సమత్వమందు
నాతఁ డిహమందె సంసార ణాబ్ధి దాఁటు;
పాపములు లేమి, మఱి సమత్వంబుకలిమి
యాత్మగుణములు కాన, వాఁడాత్మఁజెందు.

20. ఆ. బ్రహ్మవిదుఁడు బుద్ధి బ్రహ్మంబుననె నిల్పు;
మౌఢ్యగుణములనెల్ల మానివైచు;
సంతసింపఁడెంత సంప్రీతి గలిగినఁ
జింతఁ జెందఁ డెంతవంత యైన.

21. తే. బాహ్యశబ్దాదులందు సంబంధపడక
యంతరాత్మనె సుఖములనందు నెవ్వఁ
డతనినే బ్రహ్మయోగయుక్తాత్ముఁ డండ్రు;
అతని కగు నాశరహిత మైనట్టి సుఖము.

22. తే. స్పర్శ నాదిసుఖంబుల జన్యము లగు
భోగములు దుఃఖహేతువుల్పుణ్యచరిత;
వచ్చుచును బోవుచుండు; నవ్వాని బుధులు
సరకుసేయరు మఱి సంతసమునఁ గనరు.