ఈ పుట ఆమోదించబడ్డది

63. తే. క్రోధముననె మోహంబు సేకూరుచుండు;
మోహమున స్మృతి భ్రమియింప మొదలుపెట్టు;
స్మృతి భ్రమించిన, బుద్ధి నశించు;దాని
వలన మనుజుండు తప్పక భ్రష్టుఁడగును.

64. తే. రాగముల ద్వేషములను వర్జన మొనర్చి
విషయముల నింద్రియంబులు విడిచివైచి
వశ్యములు గాఁగ, స్వాధీనపడిన మనసు
గలుగు నెపుడు, ప్రసాదంబు గలుగు నపుడె.

65. తే. అలప్రసాదంబు లభియించినపుడె వాని
సర్వదుఃఖంబులకు హాని సంభవించుÑ
మనసు నైర్మల్యమును బొందు మఱియు బుద్ధి
చంచలింపక స్థిరపడు సత్వరముగ.

66. తే. యోగహీనున కిల బుద్ధి యుండఁబోదు;
భావనాశక్తి యతనికిఁబట్టువడదు;
భావనాశూన్యునకు శాంతిఁబడయరాదు;
శాంతి లేకున్న సుఖమెట్లు సంభవించు?

67 ఆ. ఏమనుష్యు చిత్తమింద్రియంబులవెంట
నంటి తిరుగుచుండు ననవరతము
అదియ వానిప్రజ్ఞ నాకర్షణము సేయు
గాలివలన నావ కదలినట్లు.

68. తే. కాన విషయంబులందు సంగంబు లేక
యెవఁడు సర్వవిధంబుల నింద్రియముల
నిగ్రహించునొ యట్టిమనీషివర్యుఁ
డగును శుద్ధాత్మదర్శకండతులితముగ.