ఈ పుట ఆమోదించబడ్డది

46.తే.జలసమృద్ధమైయుండు కాసారమందు
వలయునీరంబె యుపయోగ । పఱచునట్లు
సర్వవేదంబులందును జ్ఞానియైన
బ్రాహ్మణుఁడు గొనుఁ దనకుఁగావలసినంతె.

47. ఆ. కర్మమందె నీకుఁ కల దధికారంబు;
ఫలమునందు నాశఁబడయవలదు;
కర్మఫలమునకును గాఁబోకు హేతువు;
కర్మలోపమునకుఁ గాకు మట్లె

48. ఆ. సవ్యసాచి ! నీవు సంగంబు వర్జించి
సిద్ధిఁ జూచినట్ల సిద్ధిఁ జూచి
యోగమందె నిలిచి యొనరింపు కర్మంబు;
లట్టి సమత యోగమండ్రు బుధులు.

49. తే. కామ్యకర్మంబు నీచంబు కామ్యరహిత
కర్మ మొనరించు బుద్ధియోగంబుకంటె;
ఫలముపైఁ గాంక్ష నీచులపాలుగాన
బుద్ధి యోగంబుచే నీవు సిద్ధి గనుము.

50. తే. బుద్ధియుక్తుండు విడుచు నీపుడమియందు
సుకృత దుష్కృతములను విశుద్ధ చరిత!
కనుకఁ జరియింపు బుద్ధియోగమున నెపుడుఁ
గర్మములయందు యోగంబు కౌశలంబు

51. ఆ. బుద్ధియుక్తుఁడైన పురుషుండు జ్ఞానియై
కర్మఫలములందుఁ గాంక్ష విడిచి
జన్మబంధములను సంపూర్ణముగ వీడి
శ్రేష్ఠమైన పదముఁ జేరుకొనును.